కరోనా పాండమిక్: ఇది నిఖార్సయిన పొలిటికల్ డిజాస్టర్

‘కరోనా బాధితులకి ఆరోగ్య శ్రీ ద్వారా అత్యద్భుమైన చికిత్స అందించేలా చేయగలిగాం.. అవసరమైతే, ప్రైవేటు ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం చెల్లింపుల్ని పెంచుదాం..‘ అంటూ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ చాలా చాలా గొప్పలు చెప్పుకుంటోంది. కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోన్నవారి శాతమెంత.? ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నవారి శాతమెంత.? అన్న లెక్కలు తీస్తే, అసలు విషయం బయటపడుతుంది.

ఆరోగ్యశ్రీ మంచి ఆలోచనే. కానీ, ఆ ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఆసుపత్రులెలా దుర్వినియోగం చేస్తున్నాయో నిత్యం చూస్తూనే వున్నాం. అవసరమైనదానికీ, అవసరం లేనిదానికీ కోసి పారేయడం.. తద్వారా తమ స్థాయి పెంచుకోవడం, ఆర్థికంగా బలపడటం.. ఇదీ ప్రైవేటు ఆసుపత్రుల ఘనకార్యం.

ఆరోగ్యశ్రీ కారణంగా బలిసిన ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రభుత్వాల్ని బెదిరించేస్థాయికొచ్చేయడమూ చూశాం. అయినా, ప్రైవేటు మీద ప్రభుత్వాలకు మమకారం తగ్గడంలేదు. ప్రైవేటు ఆసుపత్రుల్ని పెంచి పోషించడం మాని, ప్రభుత్వాసుపత్రుల్ని ఉద్ధరించి వుంటే, ఇప్పుడీ దుస్థితి వచ్చేది కాదు.

విద్య, వైద్యం.. ఈ రెండు విభాగాలపైనే ప్రభుత్వాలు అత్యధికంగా ఖర్చు చేస్తుంటాయి, చెయ్యాలి కూడా. కానీ, ఏం లాభం.? ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలుండవు. వున్నా, రాజకీయ నాయకులు అటువైపు చూడరు. కరోనా సోకగానే, అధికార పార్టీ నేతలు ఆంధ్రపదేశ్ నుంచి హుటాహుటిన తెలంగాణకు పారిపోయిన వైనం చూశాం. ఏం.? ప్రభుత్వాసుపత్రుల్లో ఎందుకు చేరలేదు.? ఈ ప్రశ్న ఒక్కటి చాలు, రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రభుత్వ పెద్దలకు వున్న చిత్తశుద్ధి ఏంటో చెప్పడానికి.

ప్రైవేటు ఆసుపత్రులు, రెమిడిసివిర్ వంటి ఇంజెక్షన్ల పేరుతో కరోనా బాధితుల్ని, వారి కుటుంబాల్ని నిలువునా దోచేస్తున్నాయి. తాటాకు చప్పుళ్ళన్నట్టు.. ప్రభుత్వ పెద్దలు, అధికారులు.. ‘అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదు..’ అంటున్నారు. కానీ, ప్రైవేటు ఆసుపత్రులు ఏకంగా.. పదిరెట్లు లాభపడుతున్నాయి ఒక్కో ఇంజెక్షన్ మీదా. అలాంటి ఆసుపత్రుల్ని తెరవెనుక నడుపుతున్నది రాజకీయ నాయకులే అయినప్పుడు, ఇలాంటి డిజాస్టర్స్ ఎందుకు జరగకుండా వుంటాయ్.?

ఆంధ్రపదేశ్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అదే ప్రభుత్వ ఆసుపత్రుల్ని గడచిన ఏడాది కాలంలో అయినా బలోపేతం చేసి వుంటే, ఇప్పుడీ హెల్త్ డిజాస్టర్ తలెత్తేది కాదేమో..!