తగ్గేదే లేదు.. రాష్ట్రంలో అధికార వైసీపీకి రాజకీయాలే ముఖ్యం.. ప్రజల ప్రాణాలెలా పోయినా వాళ్ళకు అనవసరం.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెప్పుకోసమే మంత్రులు ఇలా చేస్తున్నారా.? లేదంటే, ఇంకేదన్నా కారణం వుందా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, కొందరు రాష్ట్ర మంత్రుల తీరు మాత్రం ఆక్షేపణీయంగా తయారైంది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా విలయం ఒకేలా కనిపిస్తోంది. ఈ తరుణంలో ఎవరు రాజకీయాలు మాట్లాడినా అది సమర్థనీయం కాదు. విపక్షాలు రాజకీయాలు చేస్తే, వాటికి ఫలితం అనుభవిస్తాయి.. అందులో ఇంకో మాటకు తావు లేదు.
అధికార పార్టీకీ అదే సూత్రం వర్తిస్తుంది. అయితే, అధికార పార్టీని అప్రమత్తం చేయడానికి విపక్షాలు గొంతు విప్పాల్సిందే.. అది వాటి బాధ్యత. కానీ, అధికారపక్షం ఏం చేస్తోంది.? టీడీపీ అధినేత చంద్రబాబుని ఉద్దేశించి ‘420 వైరస్’ అని పేరు పెడుతున్నారు కొందరు మంత్రులు. మీడియా ముందుకొచ్చి, పది నిమిషాలు.. ఇరవై నిమిషాలుు.. ముప్ఫయ్ నిమిషాలు.. ఊకదంపుడు ప్రసంగాలు చేసేస్తున్నారు.. చంద్రబాబుని విమర్శించడం కోసం. ఈ సమయంలో మంత్రులు, బాధ్యతగా ప్రజల సమస్యల మీద దృష్టి పెడితే, బోల్డన్ని ప్రాణాలు కాపాడబడతాయి. రాష్ట్రంలో ఆక్సిజన్ కోసం, రెమిడిసివిర్ కోసం, ఇతరత్రా మందుల కోసం, ఆసుపత్రుల్లో పడకలకోసం వందలాది మంది, వేలాది మంది సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తున్నారు. వాటిని మంత్రులు ప్రత్యక్షంగా మానిటరింగ్ చేసి, అవసరమైనవారికి సాయం అందిస్తే బావుంటుంది కదా.?
నిన్న మంత్రి కొడాలి నాని, నేడు మరో మంత్రి కన్నబాబు.. రేపు ఇంకెవరో.. చంద్రబాబుని విమర్శించాలంటే, దానికి మరో సమయం ఖచ్చితంగా వుంటుంది.. ముందు ముందు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాని నరేంద్ర మోడీ మీద విమర్శలు చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రికి సోషల్ మీడియా వేదికగా క్లాస్ తీసుకున్నారు.. ఈ సమయంలో రాజకీయాలు తగదని. మరి, మంత్రులు చేస్తున్నదేంటి.? ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తన మంత్రి వర్గ సహచరులకు ఈ విషయమై క్లాస్ తీసుకోవాల్సి వుందేమో.