ఎలక్షన్స్ ఎప్పుడు? అంటూ ప్రశ్నించిన ప్రకాష్ రాజ్

మూవీ ఆర్టిస్టులు సంఘం (మా) ఎన్నికల హంగామా చూస్తున్నదే. ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకముందే ప్రకాష్ రాజ్ ప్యానెల్ ని ప్రకటించి దూకుడు ప్రదర్శించారు. ఆ వెంటనే వీకే నరేష్.. విష్ణు.. జీవిత.. హేమ.. సీవీఎల్ వంటి వారు బరిలోకి వచ్చారు. వీరంతా ఎవరికి వారు మద్ధతును కూడగట్టుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ కి చిరు మద్ధతు ఉండగా అతడిదే విక్టరీ అన్న ప్రచారం సాగిపోతోంది.

అయితే సినీపెద్దలంతా ఈసారి మా ఎన్నిక వివాదరహితంగా ఉండాలని ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కథనాలొస్తున్నాయి. మా మాజీ అధ్యక్షుడు మురళి మోహన్ సైతం ఏకగ్రీవం అంటూ ప్రకటించడం కలకలం రేపింది.

కారణం ఏదైనా కానీ ఏకగ్రీవం అన్న మాట వినపడగానే ఒక్కసారిగా గొడవలు సద్ధుమణిగినట్టే అనిపించింది. వర్గపోరు మీడియా ముందు ప్రకటనలు కాస్త ఆగాయి. అయితే ఉన్నట్టుండి సడెన్ గా ప్రకాష్ రాజ్ `ఎలక్షన్స్ ఎప్పుడు?` అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించడంతో మరోసారి కెలికినట్టే అయ్యింది. ఆయన కు ఎన్నికలు నచ్చినట్టు ఏకగ్రీవం అన్న పదం వినడమే ఇష్టం లేదని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు జరగాలి. మా అధ్యక్షునిగా ఎవరో ఒకరు గెలవాలన్నదే ఆయన సిద్ధాంతం.

ఇకపోతే మా నోటిఫికేషన్ వచ్చే వరకూ ఎలాంటి హడావుడి చేయకుండా తమ వర్గాన్ని ఒక గూటికి చేర్చుకునే పనిలో ప్రకాష్ రాజ్ ఉన్నారని తెలిసింది. నోటిఫికేషన్ వస్తే కానీ ప్రకాష్ రాజ్ వర్గం యాక్టివేట్ కాదు. ఆయన యాక్టివేట్ కాగానే ప్రత్యర్థులు రంగంలోకి దిగుతారన్నమాట. అయితే ఈసారి గత నాలుగేళ్ల చరిత్రను పరిశీలించి ఈ పోటీని విరమిస్తేనే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి సినీపెద్దలు చిరంజీవి- మోహన్ బాబు వంటి ప్రముఖులు నిర్ణయించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ లో మా అసోసియేషన్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.