సరికొత్త ‘OTT’ ప్రారంభించే ఆలోచనలో స్టార్ ప్రొడ్యూసర్..?

డిజిటల్ వరల్డ్ లో ఓటీటీల హవా ప్రారంభమైంది. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్లకు వెళ్లే జనాలు.. ఇప్పుడు చేతిలో ఉన్న మొబైల్ లో తమకు నచ్చిన సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే ఇప్పటికే ఉన్న డిజిటల్ వేదికలతో పాటుగా మరికొన్ని ఓటీటీలు ఏటీటీలు పుట్టుకొస్తున్నాయి. ప్రేక్షకులు తమకు ఇష్టమొచ్చిన మధ్యమాలలో నచ్చిన కంటెంట్ ను వీక్షించడానికి ఈ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అవకాశం కల్పిస్తున్నాయని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే రాజ్యమని గ్రహించిన చాలామంది ప్రముఖులు ఓటీటీ బిజినెస్ లో అడుగుపెడుతున్నారు.

అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. మై హోమ్ గ్రూప్ రామ్ తో కలిసి 100 శాతం తెలుగు కంటెంట్ తో ”ఆహా” ఓటీటీకి శ్రీకారం చుట్టారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ని స్ట్రీమింగ్ పెడుతూ వీక్షకులను ఆకట్టుకుంటున్నారు. సరికొత్త సినిమాలు – వెబ్ సిరీస్ లు – బ్లాక్ బస్టర్ సినిమాల తోపాటుగా ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన చిత్రాలను కూడా డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో సబ్ స్క్రైబర్స్ పెంచుకుంటూ పోతున్నారు. ఇటీవల యువ పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు కూడా నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ అంటూ ”స్పార్క్” అనే సరికొత్త ఓటీటీని లాంచ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ.. ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో ‘ఈటీవీ’ అధినేత రామోజీరావు కూడా ఓటీటీ రంగంలో ఎంటర్ అవుతున్నాడు. ఇప్పటికే ఓటీటీ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే బాటలో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఓటీటీ స్టార్ట్ చేసే ఆలోచన చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఆలోచనలను కాలానుగుణంగా
మార్చుకునే దిల్ రాజు.. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఓటీటీ వ్యాపారంలో దిగాలని చూస్తున్నారట. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ – బాలీవుడ్ చిత్రాలు అంటూ దాదాపు పది సినిమాలను నిర్మిస్తున్న నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు.. ‘ఆహా’ ఓటీటీలో క్రియేటివ్ పార్టనర్షిప్ కలిగియున్నారు. అయితే తానే సొంతంగా ఓటీటీని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాదు దిల్ రాజు ఇందులో హీరో రామ్ చరణ్ కి కూడా పార్టనర్ షిప్ ఇవ్వనున్నారని టాక్ నడుస్తోంది. ఇటీవల రామ్ చరణ్ – ఎన్టీఆర్ – రాజమౌళి కలిసి ‘RRR’ అనే ఓటీటీ పెడుతున్నారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దిల్ రాజు ఓటిటి మీద కూడా ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతానికైతే ఓటీటీ కోసం ఎవరు ఎవరితో టై అప్ అవుతున్నారు అనేది మిస్టరీగా ఉంది. అసలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ పెడతారా లేదా? ఇవన్నీ రూమర్స్ యేనా? అన్నది రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

ఇదిలా ఉండగా అక్కినేని – దగ్గుబాటి ఫ్యామిలీలు కలిసి ఓటీటీ బిజినెస్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆ మధ్య ఇలానే టాక్ వచ్చింది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఓటీటీతో టై అప్ అయిన నిర్మాత సురేశ్ బాబు.. నాగార్జున మరియు ఓ బాంబే టీమ్ తో కలిసి ఓటీటీని రెడీ చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడంతో ఓటీటీ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఏదేమైనా భవిష్యత్ లో ఓటీటీ రంగమే పెద్ద బిజినెస్ సెక్టార్ గా మారుతుందని ఎక్కువ మంది సినీ ప్రముఖులు భావిస్తున్నట్లు అర్థం అవుతోంది.