పోలవరం ప్రాజెక్టు ఘనత ఎవరిది.? అన్న విషయమై చాలా రచ్చ జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ హయాంలో.. జలయజ్ణం పేరుతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచారు. అంతకంటే ముందే, పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగిందన్నది బహిరంగ రహస్యం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో, ప్రధాన ప్రాజెక్టుని పక్కన పెట్టి, కాలువల ద్వారా అవినీతిని పారించారన్న విమర్శలున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక, పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా పొందిన దరిమిలా, అటు కేంద్రం నిధులు మంజూరు చేస్తే, ఇటు రాష్ట్రం ఈ ప్రాజెక్టు నిర్మించాల్సిన పరిస్థితి. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, వైఎస్ జగన్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూనే వుంది.
పోలవరం ప్రాజెక్టు పక్కనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెట్టాలన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలోచన. చంద్రబాబు ఆలోచనలు ఇంకోలా వుండి వుంటాయి. ఇంతకీ, పోలవరం ప్రాజెక్టు కారణంగా తమ ఇళ్ళను, భూముల్ని కోల్పోయినవారి పరిస్థితేంటి.? ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబు, జగన్ ఏం చెప్పారు.? అధికారంలోకి వచ్చాక ఏం చేశారు.? జనసేన మాజీ నేత కళ్యాణ్ దిలీప్ సుంకర పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల విషయమై తాజాగా ఓ వీడియో చేశారు. ఇందులో ముంపు బాధితుల ఆవేదనను కళ్ళకు కట్టినట్లుగా వినిపించారు.
పోలవరం ప్రాజెక్టులో పారేవి నీళ్ళు కాదు, ముంపు బాధితుల కన్నీళ్ళు.. అని ఆయన వీడియో చూశాక ఎవరికైనా అనిపించకమానదు. జనసేన నేతగా వున్న సమయంలోనే ఆయన పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల వెతల్ని తెలుసుకున్నారు. త్యాగాలు ఎవరివి, ఫలాలు ఎవరివి.? పబ్లిసిటీ ఎవరిది.? అని కళ్యాణ్ దిలీప్ సుంకర సంధించిన ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.
ముఖ్యమంత్రి నివాసం పక్కన పేదలుండటానికి వీల్లేదన్నట్టు.. పేదల ఇళ్ళను కూల్చేసిన ప్రభుత్వాల్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి రాక కోసం రోడ్ల మీద ట్రాఫిక్ ఆపేస్తున్న వైనం కనిపిస్తోంది. వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల కోసం ఖర్చవుతోందంటే.. అది ప్రజా ధనం తప్ప.. ఏ రాజకీయ పార్టీ తన జేబుల్లోంచి ఖర్చు చేయదు వీటి కోసం. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక.. ఎవరి విగ్రహాల్ని అయినా పెట్టాలంటే.. ముంపు బాధితుల పేరుతో ఓ మ్యూజియం పెడితే బావుంటుందేమోగానీ, నాయకుల విగ్రహాల్ని పెట్టడమంటే, అంతకన్నా దిగజారుడు రాజకీయం ఇంకోటుండదు. పరిహారం ఇచ్చేస్తున్నాం.. అని ఏ ప్రభుత్వం చెప్పినా, అంతకన్నా మభ్యపెట్టే అంశం ఇంకేముంటుంది.?
పరిహారం ప్రభుత్వాలు ఇస్తాయ్.. కానీ, ఎంత.? ఎవరికి.? ఎలా.? మధ్యలో బొక్కేసే రాజకీయ దళారులు.. ఆ రాబందుల దెబ్బకి బలైపోయిన జీవితాలు.. ఔను పోలవరం ప్రాజెక్టులోంచి పారేవి ముంపు బాధితుల కన్నీళ్ళే. చాలా అంశాలపై ప్రత్యేక వీడియోలు ఎప్పటికప్పుడు చేసే కళ్యాణ్ దిలీప్ సుంకర, ఈసారి హృదయాన్ని ద్రవింపజేసేలా ఓ ఎమోషనల్ వీడియో చేయడం అభినందించదగ్గ విషయమే.