ఒకేరోజు 16 పాటలు పాడి షాకిచ్చిన మేటి గాయని

లెజెండరీ గాయని చిత్ర దశాబ్ధాలుగా తనదైన గానాలాపనతో తెలుగు శ్రోతల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. గాయనిగా ఎన్నో అవార్డులు…రివార్డులు అందుకున్నారు. జాతీయ స్థాయి అవార్డులతోనూ ఈ ప్రతిభావనిని సత్కరించారు. దేశంలో ఉన్న దాదాపు అన్ని భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. దాదాపు ఇప్పటివరకూ 20 వేలకు పైగా పాటలు పాడారు. ఇప్పటికీ అన్ని భాషల్లోనూ గాయనిగా సేవలు నిర్వారామంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిత్ర ఓ ఆసక్తికర సంగతి గురించి చెప్పుకొచ్చారు.

చిత్ర ఒకే ఒక్క రోజులో ఏకంగా 16 పాటలు పాడి ఇంటికి చేరుకున్నారట. త్రోబ్యాక్ సమయాన్ని గుర్తు చేసుకోగా.. ఇంత సమయం ఎందుకయ్యింది? అంటూ చిత్ర తల్లి ప్రశ్నించగా అసలు విషయం చెప్పడంతో షాక్ అయ్యారుట. దీంతో తన తల్లి ఎంతో కోపగించుకున్నారని తెలిపారు. ఆ సమయంలో ఆరోగ్యం కూడా అంతే జాగ్రత్త గా చూసుకోవాలని తన మాతృమూర్తి జాగ్రత్తలు చెప్పారు. దివంగత గాయకుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యం వల్లే తెలుగు నేర్చుకున్నానని తెలిపారు. ఆయన సహకరించకపోయి ఉంటే తెలుగు తొందరగా నేర్చుకునేదాన్ని కాదని అన్నారు. అలాగే తన పాప పేరు మీద ఓ ట్రస్ట్ స్థాపించి సేవలందిస్తున్నట్లు తెలిపారు.

60 ఏళ్లు పై బడిన వారందరికీ పెన్షన్ అందిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని ఆనందాన్ని వ్యక్తం చేసారు. అలాగే ఇంటర్వ్యూ ముగింపులో ఓ అరబిక్ గీతం.. క్రిమినల్ లోని `తెలుసా మనసా` పాటలపై తన అభిమానాన్ని దాచుకోలేదు చిత్ర.

తన దైన శైలిలో పవర్ ఫుల్ డైలాగ్ లతోనూ చిత్ర మైమరిపిస్తారనేది తెలిసినది తక్కువ మందికే. ఆ వీడియో ఇంటర్వ్యూలో చిత్ర డైలాగులతోనూ మెస్మరైజ్ చేశారు. చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ లో డైలాగ్ అయిన “చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో….రఫాడించేస్తా..“ .అన్న డైలాగ్ ని చెప్పారు. అలాగే బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలోని `ప్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు“ అన్న డైలాగ్ తోనూ అలరించారు. ఇండస్ట్రీ దిగ్గజ సంగీత దర్శకులతో పాటు నేటితరం మ్యూజిక్ డైరెక్టర్లందరితోనూ చిత్ర పని చేశారు. చిత్ర మునుముందు మరిన్ని మధురమైన తెలుగు పాటల్ని ఆలపించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.