టాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పుడు నేషనల్ వైడ్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేపథ్యంలో.. మెగాస్టార్ చిరంజీవి తన గత చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ తో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్ళు రాబట్టిన ఈ చిత్రం నార్త్ లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా సక్సెస్ కోసం చిరు ప్రయత్నం చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
‘ఆచార్య’ సినిమా తర్వాత చిరంజీవి “లూసిఫర్” రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో చిరు 153వ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ – సూపర్ గుడ్ ఫిలిమ్స్ – ఎన్వీఆర్ సినిమా సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే దీన్ని పాన్ ఇండియా మూవీగా చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ ప్లాన్ తోనే కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను సంప్రదించారని టాక్.
మలయాళ లూసిఫర్’ లో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రలో సత్యదేవ్ ని ఎంపిక చేసారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కనిపించిన పాత్ర కోసం సల్మాన్ ఖాన్ తో చిరు చర్చలు జరిపారట. మెగా ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యంతో ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో నటించడానికి కండలవీరుడు అంగీకారం తెలిపారని టాక్ నడుస్తోంది.
ఇదే కనుక నిజమైతే #Chiru153 చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేసే అవకాశం ఉంది. సౌత్ లో మెగాస్టార్ క్రేజ్.. ఉత్తరాదిలో సల్మాన్ ఖాన్ క్రేజ్ ఈ మూవీని మరో స్థాయికి తీసుకెళ్తాయని కచ్చితంగా చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాకు ”గాడ్ ఫాదర్” అనే టైటిల్ దాదాపు ఖరారైనట్లేనని ప్రచారం జరుగుతోంది. అలానే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తారని అంటున్నారు. వీటన్నిటిపై ఆగస్టు 22న స్పష్టత వస్తుందేమో చూడాలి.
Chiru153 చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ కంపోజింగ్ మొదలు పెట్టినట్లు వెల్లడించారు. ‘ఆచార్య’ సినిమా కోసం అద్భుతమైన టెంపుల్ టౌన్ సెట్ వేసిన సురేష్ సెల్వరాజన్.. ‘లూసిఫర్’ రీమేక్ కోసం స్పెషల్ సెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఆర్.బి. చౌదరి – ఎన్.వి.ప్రసాద్ – పరాస్ జైన్ మరియు వాకాడ అప్పారావ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.