‘దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం.. దేశంలో ఎక్కడా జరగడంలేదు. కేంద్రం కూడా, రాష్ట్రం చేస్తోన్న అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలు చూసి ముచ్చటపడుతోంది..’ అంటూ వైసీపీ నేతలు నిత్యం సొంత డబ్బా కొట్టుకుంటోన్న విషయం విదితమే. కానీ, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓ సర్వేలో ఉత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల లిస్టులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ర్యాంక్ అత్యంత దారుణంగా కనిపిస్తోంది. అసలు వైఎస్ జగన్ పేరు టాప్ టెన్‌లో కూడా కనిపించకపోవడం గమనార్హం.
అత్యుత్తమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రుల్లో స్టాలిన్ పేరు ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. 42 శాతం మంది ప్రజలు ఆయన పాలన పట్ల సంతోషంగా వున్నారట. ఇండియా టుడే గ్రూప్.. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో నిర్వహించిన సర్వే ఫలితాలివి. స్టాలిన్ తర్వాతి స్థానాల్లో నవీన్ పట్నాయక్, పినరయి విజయన్, ఉద్ధవ్ థాక్రే, మమతా బెనర్జీ తదితరులు నిలిచారు. వీరికి 30 శాతానికి పైగా రేటింగ్ తెచ్చుకున్నట్లు సదరు సర్వే చెబుతోంది. 30 నుంచి 19 శాతం రేటింగ్ దక్కించుకున్న ముఖ్యమంత్రుల్లో అస్సాం, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, జార్ఖండ్, ఛత్తీస్గడ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రలుున్నారు.
కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 19 శాతం కంటే తక్కువ రేటింగ్ దక్కించుకున్నారట. ఆయన రేటింగ్ కేవలం 6 శాతమేనట. గతంలో ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 11 శాతం రేటింగ్ దక్కించుకున్నారు. అంటే, అప్పటికీ.. ఇప్పటికీ జగన్ రేటింగ్ సగానికి పడిపోయిందన్నమాట. 2019 ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటర్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బంపర్ మెజార్టీతో కనీ వినీ ఎరుగని విజయాన్ని అందుకున్నారాయన. అలాంటి జగన్, ఇప్పుడు 6 శాతం రేటింగ్ దక్కించుకోవడమంటే, ఆశ్చర్యకరమే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన రెండేళ్ళలో అభివృద్ధి లేదు. రాజధాని సోయ అసలే లేదు. సంక్షేమం పేరుతో అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేశారు వైఎస్ జగన్. బహుశా, అందుకేనేమో.. ఈ దుస్థితి. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓటర్లను తెచ్చుకోవాల్సిన దుస్థితి అధికార వైసీపీకి రావడంతోనే.. ఆ పార్టీ వాస్తవ పరిస్థితి రాష్ట్రంలో ఏంటన్నది స్పష్టమైపోయింది.