బాలకృష్ణను పిలవలేదేమని చిరుకి నట్టి ప్రశ్న

ఏపీలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల పరిష్కారం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో పలువురు నిర్మాతలు ఈనెల 16న సమావేశమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ముందు ఉంచాల్సిన డిమాండ్ ఏమిటో మెగాస్టార్ ఆధ్వర్యంలో నిర్మాతలంతా చర్చించారు. అయితే ఈ సమావేశంపై చిన్న నిర్మాతల సంఘం ప్రతినిధి .. నిర్మాత నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చిరంజీవి గారు పరిశ్రమలో కొందరితోనే ఇలాంటి సమావేశం నిర్వహించడం సబబు కాదని ఎద్దేవా చేసారు. ఫిలిం ఛాంబర్ లో ని నిర్మాతల మండలి తో చర్చలు జరపకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

చిరంజీవి కి చిన్న నిర్మాతలు గుర్తుకు రారా? బాలకృష్ణ గారిని సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదు? అని ప్రశ్నించారు. చిరంజీవి అంటే నమ్మకం ఉంది. కానీ ఇలా పరిశ్రమని విభజించి పాలించకండని హితవు పలికారు. సినిమా ఇండస్ట్రీ అంటే `మా` అసోసియేషన్ కాదు. 24 శాఖలుంటాయి. కానీ వాళ్లలో ఎవరినీ సమావేశానికి పిలవలేదు. ఆ సమావేశంలో కేవలం పెద్ద నిర్మాతలు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇలాంటి తేడాలు లేకుండా అందర్నీ కలుపుకుని పోవాలి. పరిశ్రమ పెద్దగా దాసరి నారాయణరావు గారి తర్వాత ఆ స్థానం ఆయనకే ఇచ్చాం. ఈ విషయాలన్ని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి గారు ముందుకెళ్లాలన్నారు.

అలాగే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకూ అమలు కాలేదు. 3 నెలలు కరెంట్ బిల్లులు సబ్సిడీ ఇస్తామన్నారు.. అది జరగలేదు. జీవో 35 ఇంకా అమలు కాలేదు. ఐదవ షోకు వెసులు బాటు కల్సిస్తామన్నారు అదీ లేదు. టిక్కెట్ ధరల విషయంలోనూ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు.

అలాగే నిర్మాత సురేష్ బాబు పై కూడా నట్టి అగ్రహం వ్యక్తం చేసారు. `నారప్ప` లాంటి పెద్ద సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే థియేటర్ యాజమాన్యాలు ఏమైపోవాలని ప్రశ్నించారు. థియేటర్ వల్లే అందరం పెద్ద వాళ్లం అయ్యామన్న విషయాన్ని మర్చిపోకూడదని గుర్తు చేసారు.