సీఎం జగన్ తో చిరు భేటీ .. ఇంటిని శుద్ధి చేయలేకే ఆలస్యమా?

మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో టాలీవుడ్ పెద్దలు నేరుగా సీఎం జగన్ ని కలిసి తమ సమస్యలను విన్నవించాల్సి ఉండగా ఇంతవరకూ ఎలాంటి భేటీ లేకపోవడం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. మంత్రి పేర్ని నాని కాల్ చేసి తమను సీఎం జగన్ భేటీ కోసం ఆహ్వానించారని పరిశ్రమ సమస్యలపై అవగాహనకు వచ్చి కలవాల్సిందిగా మంత్రి చెప్పారని కథనాలొచ్చాయి.

ఆ తర్వాత మంత్రి పేర్ని నాని స్వయంగా చిరంజీవిని హైదరాబాద్ లో కలిసారు. ఆ ఇరువురి నడుమా ఏవో ముచ్చట్లు సాగాయని గుసగుసలు వినిపించాయి. నెలాఖరు నాటికే జగన్ తో చిరు భేటీ జరగాల్సి ఉండగా మరి ఇంతవరకూ దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో జగన్ తో టాలీవుడ్ పెద్దల మీటింగ్ ఉంటుందా ఉండదా? అంటూ కొందరు సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి మంత్రి పేర్ని నాని హైదరాబాద్ లో చిరు ఇంట కలవగానే ఆయనకు పరిశ్రమకు చెందిన అన్నిసమస్యలను విన్నవించి ఉండొచ్చు. ఇందులో టిక్కెట్టు రేట్లు ప్రధాన సమస్యగా ప్రస్థావించగా.. దానికి ఏపీ ప్రభుత్వానికి ఇంకా ఏవైనా అభ్యంతరాలున్నాయా? టిక్కెట్టు ధరలు పెంచేందుకు జగన్ సుముఖంగా లేరా? ఇంతకుముందు జారీ చేసిన సవరణ బిల్లును వెనక్కి తీసుకునే ఆలోచన ముఖ్యమంత్రికి లేదా? అంటూ రకరకాలుగా చర్చ సాగుతోంది. నిజానికి కరోనా కంటే కూడా ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ లు ఆగిపోవడానికి కారణం ఏపీలో టిక్కెట్టు రేట్లే. దీనిపై పలువురు నైజాంకి చెందిన నిర్మాతలు పంపిణీ వర్గాల్లోనూ ఆందోళన నెలకొంది.

ఏపీ- తెలంగాణ రెండు చోట్లా ఒకే రకమైన టిక్కెట్టు రేటు ఉండాలని అంతా పట్టుబడుతున్నారు. కానీ దీనికి జగన్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయలేదని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ భేటీ జరగకముందు ఊహాగానాలు మాత్రమే. త్వరలోనే జగన్- చిరు భేటీ జరిగేందుకు ఆస్కారం ఉంది. కానీ ఆ తేదీ ఎప్పుడు? అన్నది ఫిక్స్ కావాల్సి ఉంటుంది. ఇది ఇండస్ట్రీ సమస్య. అందువల్ల పరిశ్రమ పెద్దలందరితో సమావేశాలు నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి త్వరితగతిన పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. కానీ అంతకంతకు ఆలస్యమవుతోంది.

చిరంజీవిని కలిసాక మంత్రి పేర్ని నాని మళ్లీ జగన్ తో ఏం చెప్పారో కానీ! అంటూ ఇప్పుడు చాలా సందిగ్ధతలు నెలకొన్నాయి. దీనిపై చిరు కానీ.. మంత్రి నాని కానీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇంతకీ థియేటర్ యజమానుల సమస్యలేంటి? అంటే టిక్కెట్టు ధరలు మాత్రమే కాదు కష్ట కాలంలో కరెంటు బిల్లుల మాఫీ.. థియేటర్ల పన్ను మాఫీలు.. పార్కింగ్ ఫీజుల పెంపు వగైరా చాలానే ఉన్నాయి.

ముందు మన ఇంటిని శుద్ధి చేయాలన్న చిరు:

ఏపీ సీఎం జగన్ పిలుపు అనంతరం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలంతా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో భేటీ అయిన సంగతి తెలిసినదే. ఏపీ సీఎంని కలిసే ముందే సమస్యలపై ఒక అవగాహన కోసం ఈ భేటీలో చర్చ సాగింది. ఈ చర్చా సమావేశంలో ముందు మన ఇంటిని మనం శుద్ధి చేశాక బయట ఇంటి గురించి అడగాలని కూడా చిరు ప్రస్థావించారట. కొంతమంది అగ్ర నిర్మాతలు- పంపిణీదారులు – ఎగ్జిబిటర్ లను ఈ సమావేశంలో రకరకాల అంశాల్లో చిరు నిలదీశారు. ఈ సందర్భంగా కీలకమైన వీపీఎఫ్ ఫీజులపైనా చర్చ సాగింది. అల్లు అరవింద్ – దిల్ రాజు – సురేష్ బాబు – సునీల్ నారంగ్ కూడా ఉన్నారు. పంపిణీదారుల నుండి వర్చువల్ ప్రింట్ ఫీజు (VPF) వసూలు చేయవద్దని ఆ నలుగురిని చిరంజీవి హెచ్చరించారని కథనాలొచ్చాయి.

VPF అనేది గత కొన్నేళ్లుగా పంపిణీదారులు చెల్లిస్తున్నారు. రూ.25000 -రూ. 30000 వరకు అద్దెను వసూలు చేస్తున్నారు. ఇది ఇండస్ట్రీలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న ప్రధాన సమస్యలలో ఒకటి. ఇప్పుడు చిరంజీవి ఈ నలుగురు టాప్ డిస్ట్రిబ్యూటర్ లకు కచ్చితంగా చెప్పారు. వారు ఈ అద్దెను డిస్ట్రిబ్యూటర్ల నుండి తీసుకోవడం మానేయాలని థియేటర్ యజమానుల నుండి తీసుకోమని కోరారు. చిరంజీవి ధృఢంగా పరిశ్రమ కోసం తనవంతు ప్రయత్నం చేయాలనుకుని ఇదంతా చేస్తున్నారని ఈసారి తన సొంత బావమరిది అల్లు అరవింద్ ని కూడా వదల్లేదని గుసగుసలు వినిపించాయి. దిల్ రాజు – అల్లు అరవింద్ మెగాస్టార్ ప్రపోజల్ కి వెంటనే అంగీకరించారు. కానీ సునీల్ నారంగ్ – సురేష్ బాబు ఇద్దరూ త్వరగానే ఏదో ఒకటి చెబుతామని అన్నారని వార్తలొచ్చాయి.

ఇక ఈ భేటీలో టిక్కెట్టు ధరపైనా కీలకంగా చర్చ సాగింది. ఆన్లైన్ పోర్టల్స్ టికెటింగ్ పైనా ఈ భేటీలో చిరంజీవితో సినీపెద్దలు చర్చించారు. ఆన్ లైన్ లో ఏదైనా బుక్ చేసినప్పుడు మాకు తక్కువ ధరకు లభిస్తుంది. కానీ టిక్కెట్ ధరను మించి ఒక్కో టికెట్ పై దాదాపు రూ. 30 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ అదనపు ఫీజు బాదుడు తగ్గించమని చిరు కోరినట్టు తెలిసింది. ప్రజలు ఎక్కువగా థియేటర్ల వైపు రావాలంటే టిక్కెట్టు ధరల సవరణ అవసరమని కోరినట్టు తెలుస్తోంది. పంపిణీదారులు- ఎగ్జిబిటర్ లందరికీ వారు మొదట సరిగ్గా ఉండాలని చెప్పారు. లోపాయి కారీ వసూళ్లు సరికాదని అవ్యవస్థను సమూలంగా మార్చాలని చిరు వారిని కోరారు. ముందు మన ఇంటిని శుద్ధి చేసుకుంటే అప్పుడు అన్ని ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని అడగవచ్చు అని చిరు ప్రస్థావించారు. ఇండస్ట్రీని ఏలుతున్న ఆ నలుగురిగా అల్లు అరవింద్ – దిల్ రాజు- సురేష్ బాబు -సునీల్ నారంగ్ లను చాలా విషయాల్లో మారాలని చిరంజీవి సున్నితంగా హెచ్చరించినట్టు గుసగుసలు వినిపించాయి. థియేటర్ల సమస్యతో పాటు టికెట్ ధరలపై సీఎంతో చర్చించే ముందు ముందు మనమే మారాలని చిరు సూచించినట్టు కథనాలొచ్చాయి.

బహుశా ఇప్పటివరకూ సీఎంని కలవలేకపోవడానికి కారణాన్ని వేరొక కోణంలోనూ చూడొచ్చు. ఇంకా ఇంటిని శుద్ధి చేయలేదు. టాలీవుడ్ లో పాతుకుపోయి ఉన్న అవ్యవస్థను శుద్ధి చేయలేని పరిస్థితిలోనే చిరు ఈ భేటీని వాయిదా వేసుకున్నారనే సందేహం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్ని వెంటాడుతోంది. దీనిపై ఏదైనా అధికారిక వివరణ వస్తుందేమో కాస్త వేచి చూడాలి.