నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమా నేడు అర్థరాత్రి ఓటీటీ ద్వారా డైరెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్దం అయిన టక్ జగదీష్ కోసం చిత్ర యూనిట్ సభ్యులు ముఖ్యంగా హీరో నాని చాలా ప్రమోషన్ చేశారు. థియేటర్లలో విడుదల అయ్యే సినిమాలతో పోల్చితే ఓటీటీ రిలీజ్ సినిమాలకు ఎక్కువ ప్రచారంను మనం చూడం. కాని ఈ సినిమాకు మాత్రం కాస్త ఎక్కువ పబ్లిసిటీ చేశారు. నాని గత వారం రోజులుగా సినిమా కోసం చేస్తున్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. పెద్ద ఎత్తున మీడియా సమావేశాలు.. ఇంటర్వ్యూలతో నాని బిజీ బిజీగా ఉన్నాడు. తాజాగా నాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గత సినిమా ‘వి’ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ‘వి’ సినిమా నానికి 25వ సినిమా అనే విషయం తెల్సిందే. దిల్ రాజు నిర్మించిన ఆ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్ రిలీజ్ కు సిద్దం అయ్యింది. విడుదలకు అంతా సిద్దం అతి త్వరలో విడుదల అవ్వాల్సి ఉంది. ఈ లోపు కరోనా వచ్చింది.. సినిమా అదుగో ఇదుగో అంటూ వాయిదా వేశారు. థియేటర్లలో విడుదల అయితే చాలా ఆలస్యం అయ్యేలా ఉంది అనే ఉద్దేశ్యంతో దిల్ రాజు తప్పని పరిస్థితుల్లో ఓటీటీకి సినిమాను ఇవ్వడం జరిగింది. సినిమా లో నాని నెగటివ్ రోల్ అంటూ ప్రచారం చేశారు. కాని అది నిజం కాదు. ఇందులో ఇద్దరు హీరోలుగానే కనిపించారు. రివేంజ్ డ్రామాగా కొనసాగిన ఆ సినిమా తో నిర్మాత దిల్ రాజుకు భారీగానే లాభం వచ్చింది. ఇక స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న అమెజాన్ వారు కూడా ఫుల్ హ్యాపీగానే ఉన్నారు. కాని సినిమాను మాత్రం ప్లాప్ అన్నారు. సినిమా ప్లాప్ అంటూ కొందరు ప్రచారం చేసిన నేపథ్యంలో దిల్ రాజు గారికి అమెజాన్ వారికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో వారిద్దరు కూడా సినిమా విషయంలో కమర్షియల్ గా హ్యాపీ అయినప్పుడు ఎందుకు సినిమాను ప్లాప్ అంటున్నారో అర్థం అవ్వడం లేదు అంటూ నాని వ్యాఖ్యలు చేశాడు.
తన దృష్టిలో ‘వి’ సినిమా ఒక మంచి కమర్షియల్ హిట్ మూవీ అని కొందరు సినిమా ఫలితంను తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు అంటూ నాని అభిప్రాయం. వి సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు కూడా నటించాడు. ఇద్దరు కూడా హోరా హోరీ అన్నట్లుగా నటించారు. ఇద్దరికి కూడా మంచి కమర్షియల్ మూవీగా ఈ సినిమా నిలిచింది. కాని సోషల్ మీడియాలో కొందరు చేసిన ప్రచారం వల్ల ‘వి’ సినిమా ప్లాప్ అనే ప్రచారం జరిగింది. తాజాగా నాని కూడా అదే అభిప్రాయంను వ్యక్తం చేశాడు. ఇక టక్ జగదీష్ సినిమా కూడా ఓటీటీ ద్వారా విడుదల కాబోతుంది. కనుక ఎలాంటి ఫలితం వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.