‘పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను’

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని హీరో మంచు విష్ణు అన్నారు. తాను తెలుగు చిత్ర పరిశ్రమ వైపు ఉన్నానని.. మరో అధ్యక్ష అభ్యర్థి ప్రకాశ్ రాజ్ ఎటు వైపు ఉన్నారో చెప్పాలని విష్ణు ప్రశ్నించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం బరిలో దిగుతున్న మంచు విష్ణు.. మంగళవారం తన ప్యానెల్ సభ్యులతో కలిసి నామినేషన్స్ దాఖలు చేసిన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. తన మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి – పవన్ కల్యాణ్ లు కూడా తనకే ఓటు వేస్తారని విష్ణు ధీమా వ్యక్తం చేశారు.

మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ”ఇది తెలుగు నటీనటుల ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం. ‘మా’ ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం వద్దని నేను ముందే చెప్పా. కానీ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ‘మా’ లో సభ్యులందరూ నాకు ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నారు. నా మేనిఫెస్టో చూసిన తర్వాత చిరంజీవి గారు – పవన్ గారు వచ్చి నాకే ఓటు వేస్తారని నాకు నమ్మకం ఉంది. నాన్నగారి గురించి పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నలకు ఆయనే జవాబు చెప్తారు. ఇప్పటికే దీని గురించి ఆయన ఓ ప్రకటన కూడా ఇచ్చారు. 10వ తేదీ ఎన్నికలు అయిన వెంటనే 11వ తేదీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు” అని అన్నారు.

”ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పని తీరుపై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నేను పూర్తిగా వినలేదు. కొన్ని పాయింట్లు మాత్రమే చదివాను. ఆయన ఇండస్ట్రీ కోసం మాట్లాడారు. ఆ వ్యాఖ్యలకు మాకూ ఎలాంటి సంబంధం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన విడుదల చేసింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదు. ఏపీ – తెలంగాణ ప్రభుత్వాలు తమకు రెండు కళ్లు అని వాళ్లు ప్రకటించారు. నేను కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదు. తెలుగు పరిశ్రమ బిడ్డగా నిర్మాతగా నటుడిగా ఫిల్మ్ ఛాంబర్ ఏ లెటర్ ఇచ్చిందో దానితో నేను ఏకీభవిస్తున్నాను. ప్యానల్ సభ్యులు కూడా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వైపు ఉంటారు. ఈ విషయంలో ప్రకాశ్ రాజ్ గారు ఇండస్ట్రీ పక్కన ఉన్నారా? లేక పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్నారా? అనేది కచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే చిత్ర పరిశ్రమే మా జీవనాధారం. ఈ విషయాన్ని మీడియానే ప్రకాశ్ రాజ్ ను అడిగి చెప్పాలి” అని మంచు విష్ణు అన్నారు.

నిర్మాతలు దేవుళ్లని.. వాళ్ల మాటకు నటులుగా మేము తప్పకుండా కట్టుబడి ఉండాలని మంచు విష్ణు అన్నారు. ప్రభుత్వాలతో మాట్లాడాల్సింది నిర్మాతలే అని.. ఇండస్ట్రీలోని పెద్దలు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించారని చెప్పారు. ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని నిర్మాతలే కోరారని మంత్రి పేర్ని నాని చెప్పారని.. ఒక మంత్రి అయ్యుండి ఆయన అబద్ధాలు చెప్పరు కదా..? మీటింగ్ కు వెళ్లిన ఇండస్ట్రీ ప్రతినిధులే దీని గురించి మాట్లాడాలి అని మంచు విష్ణు అన్నారు. బండ్ల గణేష్ అన్నట్లు తనను ఎవరూ నైట్ పార్టీలకు పిలవలేదని.. తాను రాత్రి 9 గంటలకే నిద్రపోతానని తెలిపారు. గిఫ్టులు ఇస్తున్నారని అంటున్నారని.. తనకు ఎవరైనా గిఫ్టులు ఇస్తే బాగుంటుందని చెప్పారు. బండ్ల గణేష్ చెప్పినట్లు ‘మా’ లో ఉన్న సభ్యుల్లో కొందరికి ఇళ్ళు అవసరం ఉందని మంచు విష్ణు తెలిపారు.