జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటీవల అధికార వైసీపీ మీద విమర్శలు గుప్పిస్తూ, ‘భయం.. భయం.. ఆ భయాన్ని మీలో పుట్టిస్తా..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ‘ఫ్లాప్ సినిమాలు తీసి భయపెడతావా.?’ అంటూ మంత్రి కొడాలి నాని సెటైర్లేశారు. మరి, కొడాలి నాని నిర్మించిన సినిమాలు కూడా ప్రేక్షకుల్ని భయపెట్టడం కోసమేనా.? అన్నది వేరే చర్చ.
కానీ, పవన్ కళ్యాణ్ చెప్పిన ‘భయం’ తాలూకు అర్థమేంటో, ఇరవై నాలుగ్గంటలు తిరగకుండానే అధికార పార్టీలో కనిపించింది. పవన్ కళ్యాణ్, అనంతపురం జిల్లా కొత్తచెరువులో ఓ రోడ్డుపై శ్రమదానం చేస్తారనగానే, అక్కడ తాత్కాలిక రోడ్డు మరమ్మత్తు పనులు షురూ అయ్యాయి. ఇంకోపక్క, తాజాగా రాజమండ్రిలోని ధవళేశ్వరం ఆనకట్టపైనున్న రోడ్డుకి మరమ్మత్తులు తాత్కాలికంగా చేశారు.
రేపే.. అంటే, అక్టోబర్ 2న పవన్ కళ్యాణ్ ఇటు ధవళేశ్వరం ఆనకట్టపైనా, అటు కొత్త చెరువు రోడ్డుపైనా శ్రమదానం చేసి, రోడ్లకు మరమ్మత్తులు చేయనున్న సంగతి తెలిసిందే. ఆనకట్టపై మరమ్మత్తులకు అనుమతి లేదనీ, సరైన సాంకేతికపరమైన చర్యలు తీసుకోకుండా ఇప్పటికిప్పుడు తాత్కాలిక మరమ్మత్తులు చేస్తే, ఆనకట్టకు ప్రమాదం వాటిల్లుతుందంటూ ఇరిగేషన్ అధికారులు చిత్ర విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చిన.. గంటల వ్యవధిలోనే, రోడ్డుపై మరమ్మత్తులు ప్రారంభమవడం గమనార్హం.
గత నెలలో జనసేన, ప్రభుత్వానికి రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై అల్టిమేటం జారీ చేసింది. అప్పటి నుంచి కదలని ప్రభుత్వం, ఇప్పుడు.. వున్నపళంగా మరమ్మత్తులు షురూ చేయించిందంటే, దానికి పవన్ కళ్యాణ్ పుట్టించిన భయమే కారణం. ఎక్కడన్నా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు పర్యటనలకు వెళ్ళినప్పుడు, ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా రోడ్ల మరమ్మత్తులు జరుగుతుంటాయి. కానీ, రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినా, రోడ్లకు మరమ్మత్తులు జరుగుతున్నాయంటే.. అదీ పవన్ కళ్యాణ్ పవర్.
‘పవర్ లేదు.. నేను పవర్ స్టార్‌నేంటి.?’ అని ఈ మధ్యనే ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ తన మీద తానే సెటైర్ వేసుకున్నారు. కానీ, ఆయనకి పవర్ వుంది.. ఆయన చుట్టూ పవర్ వైఫైలా పనిచేస్తుంటుంది. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే రాజకీయ నాయకులకు ఆ సంగతి బాగా తెలుసు. పవన్ కళ్యాణ్.. దయచేసి, రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలో, బస్సు యాత్రలో చేయొచ్చు కదా.? రాష్ట్రంలో రోడ్లన్నీ తళతళా మెరిసిపోతాయ్.? అన్నది ఇప్పుడు జనం మాట.