బంధుప్రీతికి ఇండస్ట్రీలో తావు లేదు : రానా


నెపోటిజం.. గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న మాట ఇది. దీని కారణంగా చాలా మంది తమ టాలెంట్ని నిరూపించుకోలేకపోతున్నారని చర్చలు జరుగుతూనే వున్నాయి. తాజాగా మరోసారి దీనికి సంబంధించిన చర్చ మళ్లీ మొదలైంది. గత రెండేళ్లుగా ఇండియన్ సినిమా పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువైందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనిపై చాలా మంది ప్రముఖులు తమ తమ అభిప్రాయాలని వివిధ వేదికలపై వెల్లడించారు.

తాజాగా నెపోటిజంపై రానా దగ్గుబాటి కూడా స్పందించారు. కుటుంబ వారసత్వాన్ని పునికకిపుచ్చుకుని సినిమాల్లోకి ప్రవేశించిన రానా బంధుప్రీతిపై తన అభిప్రాయాన్ని తాజాగా ఓ నేషనల్ డైలీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దగ్గుబాటి కుటుంబంకు ఇండస్ట్రీలో వున్న గుర్తింపుని దృష్టిలో పెట్టుకుని రానా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. `నెపోటిజం నిర్వచనం ప్రకారం రాజకీయ సోపానం లేదా ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుందని.. సినీ రంగానికి ఇది వర్తించదని తెలిపారు.

సినీ రంగం కళలపై ఆధారపడి వుంటుంది. ఇక్కడ టాలెంట్ వున్న వాళ్లే రాణిస్తారు. పేరున్న కుటుంబం వారికే ఇక్కడ చోటుంది మిగతా వారికి వుండదు అనేది లేదు. ఇక్కడ ప్రతీ ఒక్కరూ తమని తాము నిరూపించుకోవడానికి కృషి చేయాల్సిందే అని రానా తనదైన స్టైల్లో సినీ రంగంలో నెపోటిజానికి తావులేదని తేల్చిపారేశాడు. ప్రస్తుతం రానా భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ బిజీగా వున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో కలిసి `భీమ్లా నాయక్`లో నటిస్తున్నాడు. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ప్లే.. మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే. దీని తరువాత వెంకటేష్తో కలిసి ఓ వెబ్ సిరీస్ని కూడా చేయబోతున్నాడు.