శంకర్.. భారతీయ సినిమాని మరో మెట్టు ఎక్కించిన దర్శకులలో ఒకరు. దక్షిణాదిలో భారీ చిత్రాలకు హై టెక్నికల్ స్టాండర్డ్స్ వున్న చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఒక సినిమాని టెక్నికల్ గా ఈ రేంజ్ లోనూ తీయోచ్చా? అని మేకర్స్ ఆశ్చర్యపడే స్థాయిలో ఆయన తన సినిమాలని తెరకెక్కించారు. ఆయన మేకింగ్ చాలా సందర్భాల్లో టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమాగా నిలిచింది. అంతే కాకుండా శంకర్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన చిత్రాలన్నీ భారీ బడ్జెట్ లో హై టెక్నికల్ వ్యాల్యూస్ తో చేసినవే.
శంకర్ ఎంత టెక్నాలజీని నమ్ముకున్నా నేటీవిటీని భావోద్వేగాలని మాత్రం వీడలేదు. వాటికి సాంకేతికతని జోడించి వెండితెరపై అద్భుతాలు చేశారు. అదే ఆయనని తిరుగులేని దర్శకుడిగా నిలబెట్టింది. ఏ సినిమా చేసిన ఆ కథ వెనక ఓ ఫ్లాష్ బ్యాక్ బలమైన ఎమోషన్ తప్పని సరి. అదే అతని సినిమాలకు ప్రధాన యుఎస్పీగా మారింది. `జెంటిల్మెన్` లో వీనీత్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్… `భారతీయుడు`లో సేనాపతి ఎపిసోడ్.. `అపరిచితుడు`లో నిర్లక్ష్యం తన చెల్లి చనిపోయిన ఎపిసోడ్… ఇవే ఈ సినిమాలకు ప్రధాన ఆయువు పట్టుగా నిలిచాయి.
తాజాగా శంకర్ .. రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాకు కూడా ఇదే తరహా ఓ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ని సెట్ చేశారట. ఇదే ఈ సినిమాని ఓ రేంజ్ లో హైలైట్ గా నిలబెడుతుందని చెబుతున్నారు. శంకర్ – రామ్ చరణ్ ల తొలి కలయికలో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో చరణ్ కలెక్టర్ గా కనిపించబోతున్నారు. సమకాలీన రాజకీయాలపై శంకర్ సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం అని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది.
రాజకీయాల కారణంగా నేటి ఉద్యోగ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు..దాని తీరుతెన్నులు.. ప్రజల కనీస హక్కుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ఇన్ సైడ్ టాక్. శంకర్ సినిమాల్లో ప్రధానంగా కనిపించే బలమైన ఫ్లాష్ బ్యాక్ ఈ సినిమాకు కూడా వుంటుందని అదే సినిమాని సరికొత్త మలుపు తిప్పడమే కాకుండా కథనాయకుడి పాత్రకు ప్రధాన బలంగా నిలుస్తుందని చెబుతున్నారు.
కొత్త షెడ్యూల్ కథకు కీలకంగా నిలిచే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నేపథ్యంలో సాగనుందని ఈ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుందని మేకర్స్ చెబుతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి సునీల్ హీరో శ్రీకాంత్ జయరామ్ నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. RC 15 SVC 50 గా రూపొందుతున్న ఈ మూవీని దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించడం విశేషం.