పవన్ కల్యాణ్ స్టార్ హీరో .. ఆయనకున్న మార్కెట్ ను అందుకోవడం ఇతరులకు అంత సాధ్యం కాదు. తన తదుపరి సినిమాలకు సంబంధించిన అడ్వాన్సులు తీసుకోవాలని ఆయన అనుకుంటే 100 కోట్లు పోగు పడటానికి ఎక్కువ సమయం పట్టదు. అంతటి క్రేజ్ ఆయన సొంతం. పరాజయాలకు అతీతంగా వెళ్లడం .. ఫ్లాప్ టాక్ వచ్చినా నష్టాలు రాకపోవడం .. చాలా తక్కువమంది స్టార్ హీరోల విషయంలోనే జరుగుతుంటుంది. అలాంటి స్టార్ హీరోల జాబితాలో పవన్ ఒకరుగా కనిపిస్తాడు. ఇక ఆయా వేదికలపై పెద్ద పెద్ద దర్శక నిర్మాతలంతా కూడా ఆయనను దేవుడనే చెబుతుంటారు.
‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ నిజంగానే దేవుడి పాత్రలో కనిపిస్తాడు. అప్పటివరకూ దేవుడు అంటే తెరపై ఇలా కనిపించవలసిందే అనే పద్ధతికి పవన్ చెక్ పెట్టేశాడు. ఆయన చేసింది కృష్ణుడి పాత్రే అయినా సూటు బూటు వేసి బుల్లెట్ నడిపేస్తాడు. అది దేవుడి పాత్రే అయినా .. మిగతా సినిమాల్లో మాదిరిగానే డైలాగ్స్ చెప్పేస్తాడు. అయినా ఆ పాత్రను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. అందుకు కారణం పవన్ కి గల క్రేజ్ అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అలాంటి పవన్ మళ్లీ మరోసారి ఇప్పుడు దేవుడిగా తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నాడని అంటున్నారు.
తెలుగులో విలన్ గా బిజీ అవుతున్న సముద్రఖని తమిళంలో పెద్ద డైరెక్టర్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమానే ‘వినోధ్య సిథం’. సముద్రఖనితో పాటు తంబి రామయ్య .. మునీశ్ కాంత్ .. సంచిత శెట్టి .. షెర్లిన ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాలో పాత్ర పరంగా తంబి రామయ్య జీవితం హాయిగా .. ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే అతను హఠాత్తుగా చనిపోతాడు. పరలోకంలో అడుగుపెట్టిన అతనికి మనసు మనసులో ఉండదు. అది గమనించిన దేవుడు అందుకు కారణం అడుగుతాడు.
తనని ఒక మూడు నెలల పాటు బ్రతికించమనీ .. ఈ లోగా బాధ్యతలు తీర్చుకుని వచ్చేస్తానని దేవుడిని కోరతాడు .. అందుకు దేవుడు అంగీకరిస్తాడు. తిరిగి భూమి మీదకి వచ్చిన అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేదే కథ. ఈ కథలోని దేవుడి పాత్రనే పవన్ పవన్ చేయనున్నాడని అంటున్నారు. ఈ రీమేక్ లో సాయితేజ్ కూడా నటించనున్నాడని చెబుతున్నారు. తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలో మార్పులు చేస్తున్నారట. సముద్రఖని దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాను పూర్తి చేసిన తరువాతనే పవన్ .. ‘భవదీయుడు భగత్ సింగ్’ సెట్స్ పైకి వెళతాడని అంటున్నారు.