విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ”ఎఫ్ 3”. బ్లాక్ బస్టర్ ‘ఎఫ్ 2’ ఫ్రాంచైజీలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న సమ్మర్ సోగ్గాళ్ళను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదల తేదీని ప్రకటించడంతో ‘ఎఫ్ 3’ చిత్రానికి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏర్పడింది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని అనేక వాయిదాల తర్వాత చివరకు సంక్రాంతి కానుకగా ఈ జనవరి 7న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో మరోసారి పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది.
అయితే ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కోసం రెండు రిలీజ్ డేట్స్ ని లాక్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని 2022 మార్చి 18న లేదా ఏప్రిల్ 28న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఇది ‘ఎఫ్ 3’ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
నిజానికి ‘ఎఫ్ 3’ చిత్రాన్ని గతేడాది ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో దాన్ని సంక్రాంతికి షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. పండగ రేసులో అన్నీ పెద్ద సినిమాలే ఉండటంతో క్లాష్ ఎందుకులే అనుకొని ఫిబ్రవరి 25వ తేదీని ఫన్ అండ్ ఫస్ట్రేషన్ ప్రాంఛైజీ కోసం లాక్ చేశారు.
అయితే ఆ డేట్ ని ఫెస్టివల్ సీజన్ నుంచి తప్పుకున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం కోసం త్యాగం చేయాల్సి వచ్చింది.
ఈ క్రమంలో ఏప్రిల్ 29న ‘ఎఫ్ 3’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. మళ్ళీ ఏమి ఆలోచించారో ఏమో చివరగా ఏప్రిల్ 28న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
అయితే ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి అదే తేదీని లాక్ చేశారు. వెంకటేష్ – వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్.. ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాతో పోటీపడే అవకాశం లేదు.
బాక్సాఫీస్ వద్ద క్లాష్ ని నివారించడానికి ‘ఎఫ్ 3’ చిత్రాన్ని ఇప్పటికే వాయిదా వేశారు. కానీ ఇప్పుడు RRR కోసం మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుండటంతో ‘ఎఫ్ 2’ ప్రాంఛైజీ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
ఒకవేళ మార్చి 18న ‘రాధే శ్యామ్’ రావాలని ఫిక్స్ అయితే మాత్రం.. ‘ఆర్.ఆర్.ఆర్’ కచ్చితంగా ఏప్రిల్ చివరి వారంలోనే విడుదల అవుతుంది. అదే జరిగితే ‘F3’ కోసం ప్రత్యామ్నాయ విడుదల తేదీని ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.