ఆంధ్రప్రదేశ్ లో చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన ఈ నిర్ణయంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర క్రియేటివ్, కల్చర్ కమిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఏపీ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడిని ప్రతివాదులుగా చేర్చారు.
పిటిషన్ లో రఘురామ పొందుపరచిన అంశాలను పరిశీలిస్తే.. ‘చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వేలాది మంది కళాకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉంది. ఈక్రమంలో ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ జారీ చేసిన జీవో 7ను రద్దు చేయాలి. తద్వారా ప్రభుత్వ చర్యలను నివారించాలి’ అని కోరారు.