విడాకుల తర్వాత సమంత వేగం పెంచిన సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమిట్ మెంట్లతో కెరీర్ ని పరుగులు పెట్టిస్తోంది. వివాహం తర్వాత వచ్చిన గ్యాప్ ని మొత్తం పుల్ ఫిల్ చేసే పనిలో పడింది. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న `శాకుంతలం` షూటింగ్ పూర్తిచేసింది. ఆ వెంటనే `యశోద` అనే థ్రిల్లర్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లింది. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు క్లైమాక్స్ కి వచ్చింది. ఐటం పాటల్లోనూ నర్తిస్తూ మార్క్ వేస్తోంది. మరోవైపు హీరోలకు జోడీగాను సంతకాలు చేస్తోంది. మరి ఇంత బిజీగా ఉన్న సమంత ఇప్పుడు ఒక్కో సినిమాకి ఎంత పారితోషికం తీసుకుంటున్నట్లు? అంటే..
ఆకాశాన్నంటుతున్నట్లే కనిపిస్తోంది. ఇటీవలే విజయ్ దేవరకొండ సరసన నటించడానికి ఓ కొత్త ప్రాజెక్ట్ కమిట్ అయినట్లు వార్తలొచ్చాయి. ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే ఈ సినిమా కోసం సమంత 3 కోట్లు తీసుకుంటుందని సమాచారం. ఈ ఆఫర్ ని సదరు సంస్థ సమంతకి ఇచ్చిందా? ఆమె డిమాండ్ చేసిందా? అన్నది తెలియదు గానీ 3 కోట్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఇదే బ్యానర్ నిర్మించిన `పుష్ప` దిరైజ్ లో సమంత `ఊ అంటావా మావ ఊఊ అంటావా` పాటలో నర్తించింది. ఆ పాటలో నటించేందుకు 1.5 కోట్లు తీసుకుందిట.
ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతలకు ఆ సినిమా ద్వారా భారీ లాభాలొచ్చాయి. అందుకే ఇప్పుడిలా కొత్తప్రాజెక్ట్ కి 3 కోట్లు ఆఫర్ చేసారా? అన్నసందేహం రాక మానదు. ఇక ఇదే వేవ్ లో పూజాహెగ్డే.. రష్మిక మందన్నకూడా కొనసాగుతున్నారు. పూజా బ్యూటీ ఒక్కో సినిమాకి 3.5 కోట్లు తీసుకుంటోందిట. రష్మిక రేంజ్ పెరిగింది. ఆమె కూడా 3 కోట్ల వరకూ ఛార్జ్ చేస్తోందిట. ఈ కోవలోనే సమంత కూడా పారితోషికం హైక్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే సమంత రెండు లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. వాటికి ఎంత ఛార్జ్ చేస్తుంది అన్నది ఇంకా బయటకు రాలేదు. మూడు కోట్లకు మించి పారితోషికం తీసుకుంటుందా? అన్న ఊహాగానాలు అయితే తెరపైకి వస్తున్నాయి. టాలీవుడ్ లో సమంతకు మంచి పేరుంది. అంతకు మించి బ్రాండ్ వ్యాల్యూ ఉంది. సమంత నటించిన `ఓ బేబి` లాంటి చిత్రం నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. ఓ రకంగా చెప్పాలంటే సమంత పారితోషికం హైక్ చేయడంలో నెమ్మదిగానే ఉందని చెప్పాలి.
టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అయిన సమంత పారితోషికం విషయంలో పట్టువిడుపులు ఉంటాయని పాజిటివ్ సైన్ ఉంది. ఆమె కన్నా వెనకొచ్చిన హీరోయిన్లు చాలా మంది పారితోషికం ముక్కు పిండి వసూల్ చేసినట్లు గతంలో మీడియా కథనాలు వేడెక్కించిన సంగతి తెలిసిందే. కానీ సామ్ విషయంలో అలాంటి వ్యతిరేక పవనాలు ఏనాడు వీయలేదు.