మూడు జిల్లాలూ.. ముగ్గురి ఆశలూ… ?

తూర్పు గోదావరి జిల్లా అంటే ఇప్పటిదాకా పెద్ద జిల్లా. భౌగోళికంగా చూసుకుంటే ఏపీలోనే నంబర్ వన్ గా ఉంటోంది. ఇక ఎమ్మెల్యేలు మొత్తం 19 మంది ఉన్నారు. అయితే కొత్త జిల్లాల పేరుతో దీనిని మూడు ముక్కలు చేస్తున్నారు. కోనసీమ తూర్పుగోదవరి రాజమహేంద్రవరం పేరిట కొత్త జిల్లాలు రాబోతున్నాయి. మరి ఈ మూడు జిల్లాల నుంచి ముగ్గురికి మంత్రి పదవులు గ్యారంటీ.

ఆ లక్కీ ఎవరిని వరిస్తుందో అన్నదే ఇక్కడ చర్చ. వైసీపీకి 2019 ఎన్నికల్లో మొత్తం 19 సీట్లకు గానూ మెజారిటీ సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. దాంతో మంత్రి పదవుల కోసం ఆనాడే భారీ పోటీ ఏర్పడింది. అయితే మరో విడత విస్తరణ ఉంటుందని నాడు జగన్ చెప్పడంతో అంతా తగ్గారు. అయితే ఇపుడు ఆ సమయం రానే వచ్చింది.

స్వయంగా జగనే త్వరలో విస్తరణ అని ప్రకటించేశాక ఆశావహులు ఊరుకుంటారా. తూర్పు గోదావరి జిల్లా నుంచి ముగ్గురు హేమా హమీలు మంత్రి పదవుల కోసం వీర లెవెల్ లో ట్రై చేస్తున్నారు. తమ టాలెంట్ తో పాటు సామాజిక సమీకరణలను ముందుకు తెస్తున్నారు. ఇప్పటికైతే చూసుకుంటే కాకినాడ అర్బన్ నుంచి గెలిచిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గట్టిగానే ట్రై చేస్తున్నారు.

ఆయన జగన్ కి అత్యంత సన్నిహితుడు. పైగా జగన్ సీఎం కావాలని మొక్కుకున్నారు. కాకినాడ నుంచి సింహాచలం దాకా భారీ పాదయాత్రను ఆయన ఈ మధ్యనే పూర్తి చేశారు. తనకు గ్యారంటీగా పదవి వస్తుందని ఆయన భావిస్తున్నారు. అయితే ఆయన ప్రాంతం కీలకం అయినా కులమే మైనస్ అవుతుందా అన్న చర్చ ఉంది. ఏదైనా అద్భుతమే జరిగితే కొత్త జిల్లాకు ఆయనే మంత్రి అవుతారుట.

ఇక తుని నుంచి గెలిచిన దాడిశెట్టి రాజాకు మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు అంటున్నారు. రాజా రెండు విడతలుగా అక్కడ గెలుస్తూ వస్తున్నారు. బలమైన టీడీపీ నేత యనమ రామక్రిష్ణుడు కుటుంబాన్ని ఆయన వరసబెట్టి ఓడిస్తూ వస్తున్నారు. ఇక కాపు సామాజికవర్గానికి చెందిన రాజా జగన్ కి బహు ఇష్టుడు. తుని అంటే తూర్పుగోదావరిలో ఇంపార్టెంట్ ప్లేస్ అని వేరేగా చెప్పాల్సినది లేదు.

ఇంకో నేతది రాజకీయ కుటుంబం. ఆయనే జక్కంపూడి రాజా. ఆయన తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు వైఎస్సార్ కి మంత్రి దోస్త్. జగన్ పార్టీ పెట్టగానే వచ్చి చేరిన సీనియర్ నేత. ఆయన కుటుంబం మొత్తం పదేళ్ళుగా వైసీపీని అభివృద్ధి చేయడం కోసం చాలా కష్టపడుతూ వచ్చింది మరి రాజాకు పదవి ఇవ్వడం అనివార్యమని కూడా అంటున్నారు. రాజమహేంద్రవరం జిల్లా నుంచి ఆయనే కొత్త మంత్రి అని అంటున్నారు. చూడాలి మరి వీరిలో ఎవరికి మంత్రి పదవి లభిస్తుందో. చిత్రమేంటి అంటే ఈ ముగ్గురూ కాబోయే మంత్రులమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.