మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’. ఈ మూవీ రిలీజ్ కోసం యావత్ దేశం మొత్తం దాదాపు మూడున్నరేళ్లుగా ఎదురుచూసింది. ఆ ఎదురుచూపులకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ చిత్రాన్ని మార్చి 25న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ బిజినెస్ నుంచే ఈ మూవీ రికార్డుల మోత మోగించడం మొదలుపెట్టింది. ఇక యుఎస్ ప్రీమియర్ షోలతో ఈ మూవీ సరికొత్త సంచలనాలకు తెరలేపింది.
ట్రిపుల్ ఆర్ అంటూ ఓ చిన్న పాప కథకు ఇద్దరు హీరోల స్టోరీని లింక్ చేసి జక్కన్న చేసిన మ్యాజిక్ సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా వెండితెరపై ఇద్దరు స్టార్ హీరోలు చెలరేగిపోయి నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఎన్టీఆర్ పై చిత్రీకరించిన ‘కొమురం భీముడో..’ సాంగ్ సినిమా ఎమోషన్స్ ని పతాక స్థాయికి చేర్చింది. అంతే కాకుడంఆ ఇద్దరు హీరోలు కనిపించిన సందర్భంతో పాటు వారి నేపథ్యంలో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.
సినిమాలోని పాటలతో పాటు కీరవాణి అందించిన నేపథ్య సంగీతం కూడా రోమాంచితంగా వుండటంతో సినిమాకివి ప్రత్యేక హైలైట్ గా నిలుస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రానికి కీరవాణి అందించిన నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సినిమాలో ప్రతీ ప్రేక్షకుడు లీనమయ్యేలా చేసింది. ఎన్టీఆర్ ని బంధించిన మొలల కొరడాతో దండిస్తున్న సందర్భంలో ‘బాహుబలి’ నేపథ్య సంగీతాన్ని గుర్తు చేసినా మిగతా సందర్భాల్లో మాత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది.
సినిమాకు ప్రత్యేక బలంగా నిలిచిన ఈ చిత్ర నేపథ్య సంగీతాన్ని త్వరలో విడుదల చేయబోతున్నారట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు కీరవాణి తాజాగా వెల్లడించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ట్రిపుల్ ఆర్ ఓఎస్టీ (ఒరిజినల్ సౌండ్ ట్రాక్) ని మరో నెల రోజుల్లో రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా సంగీత దర్శకుడు కీరవాణి తెలియజేశారు. అలాగే సినిమాలో కీలక పాత్ర పోషించిన పాప పాడే ‘కొమ్మా ఉయ్యాలా.. కోన జంపాలా.. ‘ అనే బిట్ సాంగ్ ని కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.
దీంతో ట్రిపుల్ ఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారట. ఇప్పటి వరకు సాధించిన వసూళ్ల పరంగా ‘ట్రిపుల్ ఆర్’ దేశ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రాల్లో 5వ సినిమాగా రికార్డుని సాధించిందని తెలుస్తోంది. దేశంలోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా రికార్డు ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పటి వరకు 2.O పీకె చిత్రాల వసూళ్లని అధిగమించి సరికొత్త రికార్డుని సాధించిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.