‘మా తెలుగుదేశం పార్టీలోంచి రాజకీయంగా ఎదిగి, వైసీపీలో చేరి.. మంత్రి పదవి దక్కించుకున్న విడదల రజని.. రాజకీయంగా ఎదగాలంటే ఎవరికైనా తెలుగుదేశం పార్టీనే తొలి మెట్టు..’ అంటూ తెలుగు తమ్ముళ్ళు విడదల రజనీ సహా రోజా తదితరుల గురించి ఘనంగా చెప్పుకుంటున్నారు.
నిజమే, ‘నేను చంద్రబాబు నాటిన మొక్కని..’ అంటూ కొన్నాళ్ళ క్రితం విడదల రజని చెప్పుకున్నారు. అప్పుడామె టీడీపీలో వున్నారు. తనకు రాజకీయంగా మంచి అవకాశాన్నిచ్చిన చంద్రబాబుని ఆకాశానికెత్తేశారామె అప్పట్లో. రోజా సంగతి సరే సరి. ఆమె తెలుగుదేశం పార్టీలో మహిళా విభాగం అధ్యక్షురాలిగా పని చేశారు. టీడీపీ నుంచి ప్రజా ప్రతినిథి కాలేకపోయారుగానీ, వైసీపీలో చేరాక.. ప్రజా ప్రతినిథి అయ్యారు.. ఇప్పుడు మంత్రి కూడా అయ్యారు.
రోజా సంగతి పక్కన పెడితే, విడదల రజని రాజకీయంగా ఎదగడం వెనుక మరింత పదునైన వ్యూహాల్ని ఆమె అమలు చేసిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. రోజా తరహాలో విడదల రజనీ ఎప్పుడూ వివాదాల్లో లేరు. రోజా తరహాలో రజనీకి సినిమా గ్లామర్ లేదు. మరెలా విడదల రజనీ, రాజకీంగా ‘స్టార్’ అయ్యారు.?
తెలుగునాట ఇప్పుడు ఎక్కడ విన్నా విడదల రజనీ గురించిన చర్చే జరుగుతోంది. ఆమె తెలంగాణ బిడ్డ అంటున్నారు.. సామాజిక వర్గ సమీకరణాలు తీస్తున్నారు. ఇవన్నీ నాణేనికి ఓ వైపు. ఇంకో కోణం చూస్తే, రాజకీయంగా తనను తాను మెరికలా మార్చుకునేందుకు ఆమె అత్యంత పదునైన వ్యూహాల్ని సొంతంగా రచించుకున్న వైనం కనిపిస్తుంది.
సోషల్ మీడియాలో విడదల రజనీ చాలా యాక్టివ్‌గా వుండేవారు. తనకంటూ ఓ టీమ్‌ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారామె. వివాదాలకు దూరంగా వున్నారు. అదే సమయంలో, అధినేత మెప్పు కోసం ఏమేం చెయ్యాలో అన్నీ చేశారు. శాసన సభలో అవకాశం వచ్చిన ప్రతిసారీ, ‘జగనన్న మీద ప్రశంసల వర్షం’ కురిపించేశారామె.
విడదల రజనీ వాగ్ధాటి కావొచ్చు, కట్టూబొట్టూ కావొచ్చు.. అన్నీ చాలా ప్రత్యేకంగా వుంటాయ్. ఇందుకోసం ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట. మంత్రి పదవి దక్కించుకునే విషయంలో కూడా, అందరి దృష్టిలోనూ ‘మంచి ఇమేజ్’ సంపాదించుకోవడానికి ఆమె చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో, ఆమె మంత్రి అవడం పట్ల ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేకపోయారు.
ప్రజలకు చేరువగా వుంటూనే, అధిష్టానం మెప్పు పొందారు. ‘కోటరీ’గా చెప్పబడే వైసీపీలోని కొందరి నేతల నుంచీ ప్రశంసలు అందుకున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా పాజిటివిటీ సంపాదించుకున్నారు. వెరసి వైసీపీ అంతర్గత సర్వేల్లో తిరుగులేని స్థానం సంపాదించుకుని, మంత్రి పదవి దక్కించుకున్నారట విడదల రజనీ.
ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇకపై వేరే లెక్క. మరి, మంత్రిగా విడదల రజనీ తనదైన ముద్ర వేయగలుగుతారా.? వేచి చూడాల్సిందే.