పదేళ్లలో 16లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కేటీఆర్

దేశంలో పరిశ్రమల స్థాపనకు తెలంగాణ కేంద్రంగా మారిందని.. ప్రముఖ సంస్థలన్నీ రాష్ట్రంలో వ్యాపార కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపడమే ఇందుకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఈ–సిటీలో రేడియంట్ అప్లయెన్సెస్ సంస్థ ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే 10ఏళ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16లక్షల ఉద్యోగాల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

తెలంగాణను వ్యాపారానికి అనువుగా మార్చేందుకు శాంతిభద్రతలు, మౌలిక వసతులపై సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకున్నారని అన్నారు. ఇక్కడి నుంచి 50లక్షల టీవీలు తయారు కావడం గర్వించే విషయమని.. సంస్థలో పని చేసే 3800 మందిలో 50 శాతం స్థానికులే ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఎలక్ట్రానిక్ రంగంలో రెండు లక్షల కోట్లు ఆదాయం సృష్టించడమే విధంగా ముందుకెళ్తున్నామని.. త్వరలో మరో రెండు ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అన్నారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.