2024 ఎన్నికల్లో ఓడిపోతే వైసీపీ ఉండదని జగన్ కు అర్ధమైంది: చంద్రబాబు

రాబోయే 2024 ఎన్నికల్లో ఓడిపోతే వైసీపీ ఉండదని జగన్ కు అర్థమయ్యిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. నియోజకవర్గ ఇంఛార్జిలు, ముఖ్యనేతలు, మండల, డివిజన్ అధ్యక్షులతో చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్సులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని.. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఉధృతంగా తీసుకువెళ్లాలని మండల అధ్యక్షులకు సూచించారు.

జగన్ సింహం కాదు పిల్లి అని.. భయంతో అందరి కాళ్లు పట్టుకున్న నేత అని ఎద్దేవా చేశారు. ప్రతిసారీ డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ బలహీనతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలన్న తన వ్యాఖ్యలను పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారని అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీలో చేరికలను ఆహ్వానించాలని నేతలకు సూచించారు. భీమిలి పర్యటనలో ప్రజలు జై బాబు అన్న నినాదాలను జై జగన్ అన్నట్లుగా మార్ఫింగ్ చేసి వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బాదుడే బాదుడుకు ప్రజల్లో విశేష స్పందన వస్తోందని అన్నారు.