నాని, నజ్రియా ఫహాద్ హీరో హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపధ్యంలో హీరోయిన్ నజ్రియా చిత్ర విశేషాలు పంచుకున్నారు. ‘కెరీర్లో కావాలని బ్రేక్ తీసుకోలేదు. త్వరగానే పెళ్లి చేసుకున్నాను. నన్ను తెరపై చూడటం ఫాహాద్ కి చాలా ఇష్టం. ‘అంటే సుందరానికీ’ అలానే విన్నా. ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కలబోతగా అద్బుతం అనిపించింది. కథ విన్నపుడు ప్రేక్షకుల్లా ఆలోచిస్తాను. భాష గురించి అలోచించను. నాను డ్యాన్స్ విషయంలో చాలా కష్టపడ్డాను. నేనెలా చేసినా బావుందని నాని, వివేక్ ఎంకరేజ్ చేసేవారు’.
కథ విని నో చెప్పొద్దన్నారు..
‘నాని గ్రేట్ కోస్టార్. ఈ ప్రయాణంలో మంచి ఫ్రండ్స్ అయిపోయాం. ఈ ప్రాజెక్ట్ కి నన్ను సంప్రదించిన మొదటి వ్యక్తి నాని. ‘కథ వినండి.. టైం తీసుకోండి. కానీ.. వద్దని మాత్రం చెప్పకండి’ అని చెప్పారు. లీలా థామస్ పాత్రలో చాలా లేయర్స్ వున్నాయి. దర్శకుడు ఈ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. వివేక్ దర్శకత్వంలో సినిమా అంటే ఓపెన్ డేట్స్ ఇచ్చేస్తా. ఆయన రైటింగ్ అద్భుతం.కొత్త భాష అన్నప్పుడు తప్పకుండా సవాల్ వుంటుంది. షూటింగ్ కి ముందే పూర్తి స్క్రిప్ట్ తీసుకుని ప్రతి డైలాగ్ నేర్చుకున్నాను. ప్రతి పదానికీ అర్ధం తెలుసుకున్నా. దీంతో షూటింగ్ సులువుగా అనిపించింది’.
తెలుగులో మరో సినిమా చేయాలనుంది..
‘మంచి స్క్రిప్ట్ వస్తే మరో తెలుగు సినిమా చేయాలని వుంది. తెలుగులో ఇది నా కమ్ బ్యాక్ మూవీ. ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆందోళన వుంది. మలయాళం అయితే నాకో జడ్జమెంట్ వుంటుంది. తెలుగు కాబట్టి జడ్జ్ మెంట్ అందడం లేదు. తెలుగులో మొదట నేను సైన్ చేశా. తర్వాతే పుష్ప వచ్చింది. రెండూ గొప్ప కథలు. సినిమాల విషయంలో ఎవరి నిర్ణయాలు వారివే. ‘అంటే సుందరానికీ’ సినిమా కోసం ఫహాద్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు.. ఇలా అందరితో నటించాలని వుంటుంది. సత్యదేవ్ నటన అంటే కూడా ఇష్టం. ఇంకా ఏదీ సైన్ చేయలేదు. కొన్ని కథలు వింటున్నా. కథలో నిజాయితీ ఉండాలి’ అని అన్నారు.