గంగూలీపై టీమ్ ఇండియా మాజీ కోచ్ చురకలు!

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి ఒకప్పటి డాషింగ్ ఓపెనర్ సౌరవ్ గంగూలీ తప్పుకోనున్న సంగతి తెలిసిందే. కొత్త బీసీసీఐ అధ్యక్షుడిగా 1983లో వరల్డ్ కప్ సాధించిన జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ ఎంపిక లాంచనప్రాయమే కానుంది. ఇప్పటికే ఆయన ఒక్కడే బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెచ్ కోచ్ రవి శాస్త్రి.. సౌరవ్ గంగూలీపై హాట్ కామెంట్స్ చేశాడు. రోజర్ బిన్నిని ప్రశంసిస్తూనే గంగూలీపై పరోక్షంగా కౌంటర్లు వేశాడు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని.. ఎవరైనా కొన్ని పనులు మాత్రమే చేయగలరంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఈ సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ.. ”బీసీసీఐ అధ్యక్షుడి రేసులో రోజర్ బిన్నీ పేరు ఉన్నందుకు ఆనందపడుతున్నా. నేను అతడితో కలిసి ఆడాను. 1983 వన్డే ప్రపంచకప్ లో బిన్నీ నేను కలిసి ఆడాం. కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇప్పుడు బీసీసీఐకి వస్తున్నాడు. అలాగే ఒక ప్రపంచకప్ విజేత జట్టులో బిన్నీ సభ్యుడు. ఇప్పుడు అతడు బీసీసీఐ అధ్యక్షుడవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు తెలిసి బీసీసీఐ అధ్యక్ష పదవిలో ప్రపంచకప్ సాధించిన టీమ్ సభ్యుడు కూర్చోనుండటం ఇదే తొలిసారి అని అంటూ రవిశాస్త్రి హాట్ కామెంట్స్ చేశాడు.

అలాగే రోజర్ బిన్నీ రాకతో అయినా దేశవాళీ క్రికెట్ లో వసతులు మెరుగుపడతాయని తాను భావిస్తున్నానన్నాడు. తద్వారా గంగూలీ హయాంలో వసతులు లేవని రవిశాస్త్రి కౌంటర్ వేసినట్టేనని క్రీడా పండితులు భావిస్తున్నారు. బిన్నీ కూడా ఒక క్రికెటరే కావడం వల్ల అతడు కచ్చితంగా బోర్డులో ఇతర వ్యవహారాల కంటే క్రికెట్ గురించే ఎక్కువ ఆలోచిస్తాడని తాను భావిస్తున్నానన్నారు.

కింది స్థాయి గ్రౌండ్స్లో వసతులు సరిగా లేవని.. వాటిపై కొత్త పాలకవర్గం దృష్టి సారించాలి రవిశాస్త్రి సూచించాడు. బీసీసీఐకి ఎవరూ రెండోసారి అధ్యక్షుడు కాలేదన్నాడు. ఇలా చూసినప్పుడు ఒకరు రావాలంటే ప్రస్తుతం ఉన్నవారు పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని చెప్పాడు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని.. అన్ని చేయాలనుకున్నప్పటికీ చివరికి కొన్ని పనులు మాత్రమే చేయగలరని రవిశాస్త్రి వేదాంత ధోరణిలో మాట్లాడటం గమనార్హం.

కాగా రవిశాస్త్రి కామెంట్స్ పై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. బిన్నీని పొగడుతూనే దాదా (సౌరవ్ గంగూలీ)కు చురకలంటించాడని పేర్కొంటున్నారు. మరోవైపు దాదా అభిమానులు మాత్రం.. ”ఎప్పుడో జరిగిన దానిని మనసులో పెట్టుకొని కొందరు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు.” అని రవిశాస్త్రికి చురకలంటించడం విశేషం.

కాగా టీమిండియా మాజీలు రవిశాస్త్రి సౌరవ్ గంగూలీ ఒకరంటే ఒకరికి పడదన్న విషయం బహిరంగ రహస్యమే. ఇద్దరి మధ్యన ఎప్పటినుంచో ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూనే ఉందని అంటారు. ఒక సందర్భంలో తనకంటే జూనియర్ అయిన సౌరవ్ గంగూలీ ముందు టీమిండియా హెడ్ కోచ్గా ఇంటర్వ్యూకు వెళ్లడానికి తనకు మనసొప్పలేదని రవిశాస్త్రి పేర్కొనడం వీరిద్దరి మధ్య విభేదాలకు నిదర్శనం. అంతేకాకుండా గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బీసీసీఐ తీసుకొచ్చిన కొన్ని పాలనాపరమైన నిర్ణయాలను కూడా రవిశాస్త్రి పలుమార్లు బాహటంగానే విమర్శించడం గమనార్హం.