నటి కం మోడల్ ప్రియా బెనర్జీ వ్యక్తిగతంగా వృత్తిపరంగా సంతోషకర స్థానంలో ఉన్నారు. ఈ భామ ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్‌లో చివరిసారిగా కనిపించింది. తదుపరి ప్రియా నటిస్తున్న రెండు సినిమాలు విడుదలకు రానున్నాయి. అలాగే మరో రెండు ప్రాజెక్ట్‌లతో ఈ ఏడాది అంతా బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం గురించి ప్రియా ఓపెనైంది.
నటుడు ప్రతీక్ బబ్బర్‌తో రిలేషన్షిప్లో ఉన్నానని ప్రియా బెనర్జీ ఈ సందర్భంగా కన్ఫామ్ చేసింది. ”మేం మూడేళ్లుగా కలిసి ఉన్నాం. మా సంబంధంపై అదనపు శ్రద్ధ అక్కర్లేదు కాబట్టి దానికి అనవసర ప్రచారం కల్పించలేదు” అని తెలిపారు.
ప్రతీక్ బబ్బర్ తో తన సంబంధాన్ని 2023 వాలెంటైన్స్ డే రోజున ప్రియా అధికారికంగా ప్రకటించింది. దాని గురించి ప్రశ్నించగా.. మేం ఇద్దరం చాలా కాలంగా కలిసి ఉన్నారని ప్రియా వెల్లడించింది. ప్రజలు ఏడాది కాలంగా మాత్రమే కలిసి ఉన్నామని అనుకుంటారు. ఎందుకంటే మేము ప్రేమికుల రోజున సోషల్ మీడియాలో అనుబంధంపై అధికారికంగా ప్రకటించాము.
అయితే ఇప్పటికి దాదాపు మూడు సంవత్సరాలు అవుతోంది. మేము మా ప్రేమాయణానికి అనవసర ప్రచారాన్ని కోరుకోలేదు. అందుకే పెద్దగా ప్రచారం లేదు” అని అన్నారు. ప్రతీక్ నటుడిగా తన పనిపై మక్కువ కలిగి ఉన్నాడు… ఇంకా తానేంటో నిరూపించుకోవాల్సి ఉంది.. అని ప్రియా తెలిపారు.
పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు స్పందిస్తూ..”ప్రతీక్ ఇప్పుడే నటుడిగా కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అతను ప్రస్తుతం చేసే పని విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నాడు. పెద్ద సక్సెస్ కోసం వేచి చూస్తున్నాడు. త్వరలోనే అనుకున్నది సాధ్యమవుతుందని ఆశిస్తున్నాం. అలాగే మా పెళ్లి జరుగుతుంది. అది జరిగినప్పుడు ఘనంగా ప్రకటిస్తాం. రిలేషన్ లో సీరియస్ గా ఉన్నాము.
అయితే ఈ సంవత్సరం పెళ్లి జరగదు” అని తెలిపింది. ప్రతీక్ గతంలో నటి అమీ జాక్సన్‌తో డేటింగ్ చేసి ఆ తర్వాత 2019లో నిర్మాత సన్యా సాగర్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట ఒక సంవత్సరం తర్వాత విడిపోయారు. అతని గతం ఎప్పుడైనా ఆందోళన కలిగించిందా? అన్న ప్రశ్నకు.. గతం ఎప్పుడూ పట్టింపు లేదని ప్రియా సమాధానమిచ్చింది.