150 కోట్ల రెమ్యునరేషన్.. హీరోకు ఇంత కష్టమా..

ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో GOAT అనే మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ జోనర్ లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం రెడీ అవుతోంది. మూవీలో విజయ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తాడనే మాట వినిపిస్తోంది. విజయ్ ఇప్పుడు చేయబోతున్న సినిమాలకు 150 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ గట్టిగానే వస్తోంది.

దీని తర్వాత విజయ్ తన కెరియర్ లో చివరి చిత్రం చేయనున్నాడు. ఆ సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాలలో బిజీ కావాలనేది అతని టార్గెట్. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. అలాగే పార్టీ ఏర్పాటు చేసి రాజకీయ కార్యకలాపాలు కూడా కొనసాగిస్తున్నారు. రెండేళ్ల తర్వాత రాబోయే తమిళనాడు ఎన్నికలే లక్ష్యంగా విజయ్ రాజకీయ కార్యాచరణ ఉంది.

ఇదిలా ఉంటే విజయ్ తన చివరి సినిమా కోసం చాలా మంది దర్శకులు చెప్పిన కథలు విజయ్ విన్నారు. ఫైనల్ గా హెచ్ వినోత్ తో మూవీ చేయడానికి ఒకే చెప్పారు. అతని కథ విజయ్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఈ సినిమాకి 250+ కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. విజయ్ చివరి సినిమాని నిర్మించడానికి డివివి దానయ్య ముందుగా రెడీ అయ్యారు.

అయితే హెచ్ వినోత్ కథ ఫైనల్ అయ్యాక బడ్జెట్ డిస్కషన్ లో డివివి దానయ్య వెనక్కి తగ్గారు. ఇప్పటి వరకు ఒక్క బ్లాక్ బస్టర్ లేని దర్శకుడి మీద 250 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయడం అంటే రిస్క్ అని భావించి ఆగిపోయారంట. తరువాత ఈ మూవీ కోసం కెవిఎన్ ప్రొడక్షన్స్ తో చర్చలు జరిపారు. అయితే ఆ నిర్మాణ సంస్థ కూడా భారీ బడ్జెట్ చెప్పేసరికి వెనక్కి తగ్గారంట.

తమిళంలో శంకర్, అట్లీ, లోకేష్ కనగరాజ్ ల మీద మాత్రమే నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఈ జాబితాలోకి కంగువతో శివ వచ్చారు. అయితే ఇతర డైరెక్టర్స్ తో రిస్క్ చేయడానికి సాహసించడం లేదు. విజయ్ మార్కెట్ ఎక్కువగానే ఉన్న ఎందుకనో నిర్మాతలు మాత్రం ధైర్యం చేయడం లేదంట. అందుకే ఈ మూవీ అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఆలస్యం అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఒక వేళ వినోత్ కాకుండా స్టార్ డైరెక్టర్స్ లలో ఒకరితో ప్లాన్ చేస్తే నిర్మాతలు ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ విషయంలో విజయ్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారనేది తెలియాల్సి ఉంది.