టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో పదే పదే వార్తల్లో నానే కార్యక్రమం ఏమైనా ఉందంటే.. అది జబర్దస్త్ కార్యక్రమనే చెప్పాలి. ఈ కార్యక్రమం మీదన పొగడ్తల కంటే కూడా విమర్శలే తరచూ వినిపిస్తూ ఉంటాయి. అంతకు మించి వివాదాలు కూడా తరచూ తెర మీదకు వస్తుంటాయి. ఈ కార్యక్రమం మీదా.. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి సంబంధించిన వార్తలు తరచూ మీడియాలో వచ్చే విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమం మీద చివరకు న్యాయస్థానాలు కూడా అప్పుడప్పడు వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది. తాజాగా ఈ కార్యక్రమంలో స్కిట్స్ వేసే కమెడియన్ పుణ్యమా అని.. ఈ కార్యక్రమం పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కేలా చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే మాస్ అవినాష్ పై తాజాగా కేసు నమోదైంది. షో చేస్తామంటూ అడ్వాన్స్ తీసుకొని.. ప్రోగ్రాంకు రాకుండా మోసం చేసిన వైనంపై తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసునమోదు చేశారు.
కర్నూలు జిల్లాకు చెందిన వేణుగోపాల్ రెడ్డి కేటీ క్రియేషన్స్ పేరుతో ఈవెంట్స్ ను నిర్వహిస్తుంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న ఒక కార్యక్రమం కోసం జబర్దస్త్ ఫేం మాస్ అవినాష్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. అయితే.. అవినాష్ కార్యక్రమానికి హాజరు కాలేదని.. దీంతో ఈవెంట్ సంస్థకు చెడ్డపేరు వచ్చిందంటూ ఫిర్యాదు చేశారు. ప్రోగ్రాం రోజున ఫోన్ స్విచ్ఛాప్ సుకొని ఉండటంతో తమ సంస్థ తీవ్ర ఇబ్బందికి గురైందని ఫిర్యాదుదారు చెబుతున్నారు. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.