ప్ర‌భాస్ ని అన్నా! అంటూ అత‌డిపై ఆది సాయికుమార్ ఎన్ కౌంట‌ర్!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ని ఉద్దేశించి బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. క‌ల్కిలో ప్ర‌భాస్ పాత్ర‌ని ఉద్దేశించి అదొక జోక‌ర్ రోల్ అని…ప్ర‌భాస్ త‌న‌కి జోక‌ర్ లా క‌నిపించాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. దీంతో ప్ర‌భాస్ అభిమానులు ఒక్క‌సారిగా నెట్టింట భ‌గ్గుమ న్నారు. వెండి తెర‌పై జోక‌ర్ వేశాలు వేసిన నువ్వు జోక‌ర్ వా? పాన్ ఇండియా అభిమానుల్ని మెప్పించినా ప్ర‌భాస్ జోక‌రా? అన్న‌ది నువ్వే డిసైడ్ చేసుకోవాలి అంటూ అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యారు.

త‌న స్థాయిని మ‌ర్చిపోయి ఇలాంటి వ్యాఖ్య‌లు దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేయ‌డం త‌న‌కే చెల్లిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. అంతేనా అర్ష‌ద్ వార్సీ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జ‌రుగుతోంది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా, అర్ష‌ద్ కామెంట్ల‌ను ఖండించాడు. `ఎంతో మంది అభిమానులు డార్లింగ్ అని పిలుచుకునే వ్య‌క్తిని అలా అన‌డం స‌బ‌బు కాద‌న్నారు. సినిమాకు రివ్వ్యూ ఇవ్వొచ్చు..విమ‌ర్శించ వ‌ద్దు.

కానీ అర్ష‌ద్ వాడిన ప‌దాలు నిర్మాణాత్మ‌క‌మైన విమ‌ర్శ‌లు కావ‌న్నారు. కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుండేద‌న్నారు. అలాగే మ‌రో యువ నిర్మాత కూడా అర్ష‌ద్ వ్యాఖ్య‌ల్ని ఖండించి గుర్తింపు కోస‌మే ఇలాంటి చిల్ల‌ర వ్యాఖ్య‌లు చేసార‌న్నాడు. ఈ నేప‌థ్యంలో తాజాగా న‌టుడు ఆది సాయికుమార్ కూడా ఖండించారు.

`ఎలాంటి అభ‌ద్ర‌తా భావం లేని న‌టుడు ప్ర‌భాస్ అన్న‌. ఆయ‌న లేక‌పోతే అస‌లు క‌ల్కి సినిమానే లేదు. ఆయ‌న రోల్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. బ‌హుశా ఆయ‌నంటే అత‌డికి అసూయేమో` అని ట్వీట్ చేసారు.