నిఖిల్‌ భయ్యా ఇది సరిపోయేనా..!

యంగ్‌ హీరో నిఖిల్‌ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో సప్తసాగరాలు దాటి హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విడుదల అనేది ఇండస్ట్రీలోనే పెద్ద సర్‌ప్రైజ్‌. నిఖిల్ వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ వస్తున్నాడు, దర్శకుడు సుధీర్‌ వర్మ సైతం రవితేజతో రావణాసుర తీసి ఆ మధ్య విడుదల చేయడం జరిగింది. అంతకు ముందు శాకినీ డాకిని సినిమా ను తీయడం జరిగింది. అసలు ఎప్పుడు ఈ సినిమాను తీశారంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా పూర్తి అయినప్పటికీ విడుదల ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నిఖిల్‌ లుక్‌ తో పోల్చితే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలో కనిపిస్తున్న లుక్‌కి చాలా తేడా ఉంది. కనుక ఈ మధ్య కాలంలో రూపొందిన సినిమా కాదేమో అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎప్పుడు రూపొందినా విడుదల సమయంలో ప్రమోషన్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడం చాలా అవసరం. విడుదలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండగా ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేయడం జరిగింది. హీరో నిఖిల్‌, దర్శకుడు సుధీర్ వర్మలను చందు మొండేటి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూతో సినిమాకు పెద్దగా బజ్ క్రియేట్‌ అవుతున్న దాఖలాలు లేవు.

సినిమా షూటింగ్‌ ప్రారంభించినప్పటి నుంచే ప్రమోషన్‌ షురూ చేస్తేనే అంచనాలు పెరుగుతాయి. అలాంటిది ఇప్పటి వరకు సినిమా గురించి జనాలకు పెద్దగా తెలియదు. హీరో నిఖిల్‌ ఇంతకు ముందు మంచి సినిమాలతో వచ్చాడు. ఆ సినిమాలు వచ్చిన సమయంలో ఈ సినిమాను తీసుకు వచ్చినా కాస్త ఫలితం ఉండేదేమో అనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌ కోసం నిఖిల్‌ హాజరు కాడనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదని మీడియా ముందుకు ఈ సినిమా కోసం నిఖిల్‌ వచ్చారు, మరో రెండు రోజుల పాటు ప్రమోషన్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటి వరకు ఈ సినిమాకు చేసిన ప్రమోషన్‌ తో మినిమం బజ్‌ కూడా క్రియేట్‌ అవ్వలేదు. కనుక నిఖిల్‌, సుధీర్‌ వర్మ కొత్తగా ఏమైనా చేస్తే తప్ప సినిమా గురించి మీడియాలో చర్చ జరగదు, జనాల దృష్టిని ఆకర్షించదు. సినిమాకు భారీ హైప్‌ క్రియేట్‌ అయితే తప్ప జనాలు థియేటర్‌ కి వచ్చే పరిస్థితి లేదు. హైప్‌ లేకుండా సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా వసూళ్ల విషయంలో సంతృప్తి ఉండదు. కనుక ఏదో ఒకటి చేసి నిఖిల్‌ ఈ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాలతో పోటీ పడటంలో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా వెనుకబడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.