భారతదేశంలో హాలీవుడ్ స్ఫూర్తితో సినిమాలు తెరకెక్కించడంలో బాలీవుడ్ ఫిలింమేకర్స్ ఎప్పుడూ ముందుంటారు. క్రిష్ ఫ్రాంఛైజీ కానీ, ధూమ్ ఫ్రాంఛైజీ కానీ, రేస్ లాంటి సినిమాలను కానీ హాలీవుడ్ స్ఫూర్తితోనే రూపొందించి పెద్ద విజయం సాధించారు.
కానీ ఇటీవలి కాలంలో హిందీ చిత్రసీమలో క్రియేటివిటీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందీ చిత్రసీమలో ప్రధాన స్టార్లు అందరూ కేవలం రీమేక్ లపై ఆధారపడుతున్నారు కానీ, తమ దర్శకులు వినిపించే ఒరిజినల్ స్క్రిప్టుల్లో నటించేందుకు ఏమాత్రం ఆసక్తిని కనబరచడం లేదు. ఖాన్ లు సహా చాలామంది హీరోలు ఇదే వైఖరిని అనుసరిస్తున్నారు.
ఇదిలా ఉంటే హృతిక్ రోషన్ తదుపరి విల్ స్మిత్ నటించిన ఐ యామ్ లెజెండ్ రీమేక్ లో నటిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఐ యామ్ లెజెండ్ హాలీవుడ్ లో రెండు దశాబ్ధాల క్రితమే విడుదలై సంచలనం సృష్టించిన మాస్టర్ పీస్. విల్ స్మిత్ నటన అసమానంగా ఉంటుంది. ఒక దీవిని వైరస్ ఆక్రమించాక మనుషులంతా ఆ వైరస్ కి గురై, వికృత రూపాలతో ఏం చేసారన్నదే ఈ సినిమా. అలాంటి చోటి నుంచి ఎస్కేప్ అయిన మనుషులు వైరస్ భారిన పడకుండా తమ ప్రాణాలను దక్కించుకోవడమెలా? అన్నది తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు.
అయితే ఇలాంటి జాంబీ తరహా కథాంశాన్ని ఎంచుకుని హృతిక్ రోషన్ లాంటి స్టార్ మళ్లీ నటించాలా? అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి. అతడు ఒరిజినల్ స్క్రిప్టుతో రూపొందించే క్రిష్ 4 కి ప్రాధాన్యతనివ్వడమే ఉత్తమం కదా! అనే అభిప్రాయం లేకపోలేదు. ఇక ఐయామ్ లెజెండ్ కి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తారని కూడా ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై ఎలాంటి ధృవీకరణ ఇంకా రాలేదు. ఇటీవల అక్షయ్ , అమీర్ ఖాన్ లాంటి స్టార్లు రీమేక్ లతో తీవ్ర నష్టాలను చవి చూసారు. అందుకే హృతిక్ ఈ విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మంచి కథ, కంటెంట్ ని అందించే సామర్థ్యం ఉన్న రచయితలు మనకు ఉన్నారు. ఫిక్షన్, సైన్స్ ఫిక్షన్ ని సమర్థంగా రాయగల ప్రతిభావంతులు ఉన్నారు. కానీ అలాంటి వారి ప్రతిభను స్టార్ హీరోలు సరిగా సద్వినియోగం చేస్తున్నారా? అన్నది సందేహంగా మారింది.