తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పోల్చుకోవడం లేదని స్పష్టం చేశారు. ‘కేటీఆర్ నాకంటే పదేళ్లు సీనియర్. ఆయనతో నేను ఎలా పోల్చుకుంటాను? ఒకవేళ మీరలా పోల్చుకుంటే మీ ఇష్టం’ అని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. రాజకీయాల్లో ఇతరులతో పోల్చుకునేంత అనుభవం తనకింకా రాలేదని లోకేష్ వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో మంచిపేరు తెచ్చుకోలేకపోయినా… తాత, తండ్రికి మాత్రం చెడ్డపేరు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురానని నారా లోకేష్ అన్నారు. పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా చేరిన ఐదు సంవత్సరాలకే తనకు ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వం దక్కడం ఆనందంగా ఉందని లోకేష్ అన్నారు. తనకిచ్చిన ఈ పదవిని బాధ్యతగానే భావిస్తున్నానని లోకేష్ చెప్పారు. నేరుగా ఎమ్మెల్యేగా కాకుండా ఎమ్మెల్సీగా పోటీ చేయడంపై వస్తున్న విమర్శలను ప్రస్తావించగా ‘నేను జగన్ మాదిరిగా మరొకరిని బలిచేసి పోటీ చేయమంటారా’ అని లోకేష్ ప్రశ్నించారు. తాను 2012 నుంచే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని, తనకు ఈ పదవి ఇచ్చినందుకు కార్యకర్తలు, నాయకత్వానికి శిరసువంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. తాను ఇక్కడి వరకు రావడానికి కారణం పార్టీ కార్యకర్తలేనని అన్నారు. అతితక్కువ కాలంలో తనకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు, కళా వెంకట్రావులకు లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.