ఆ హీరోలిద్దరూ ఒకవైపు, మిగిలిన వాళ్లు ఒకవైపు

అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ల చిత్రాలు అవలీలగా మూడు వందల కోట్ల మార్కుని చేరిపోతోంటే బాలీవుడ్‌ మార్కెట్‌ విస్తరించిందనిపిస్తుంది కానీ వాళ్లిద్దరి సినిమాలు తప్ప మిగతా చిత్రాల బిజినెస్‌ చూస్తే అది కేవలం వారికి మాత్రమే పరిమితమని తేలిపోతుంది. బాలీవుడ్‌ స్థాయిని సల్మాన్‌, అమీర్‌ పెంచారనేది నిజమే కానీ, అదే స్థాయిలో మిగతా వాళ్ల చిత్రాలు చూడ్డానికి జనం ఇష్టపడడం లేదు.

అక్షయ్‌కుమార్‌ హిట్‌ సినిమాలు అతి కష్టమ్మీద వంద కోట్ల మార్కుని చేరుతున్నాయి. షారుక్‌ ఖాన్‌ చిత్రాలకి గిరాకీ లేకుండా పోయింది. హృతిక్‌ రోషన్‌దీ అదే పరిస్థితి. అజయ్‌ దేవ్‌గణ్‌కి కూడా సీన్‌ తగ్గిపోయింది. సైఫ్‌ అలీ ఖాన్‌ డిజాస్టర్ల నవాబ్‌ అయిపోయాడు. ఇక మిగతా హిట్‌ సినిమాలన్నీ కూడా వంద కోట్ల పరిధిలోనే వుంటున్నాయి తప్ప సంచలనాలు ఏమీ నమోదు చేయడం లేదు. గత రెండు, మూడేళ్ల బాక్సాఫీస్‌ పర్‌ఫార్మెన్స్‌ని పరిగణనలోకి తీసుకుంటే అమీర్‌, సల్మాన్‌ ఇద్దరూ ఒక లెవల్లో వున్నారని, మిగతా బాలీవుడ్‌ హీరోలందరికీ ఒక రేంజ్‌ అని స్పష్టమవుతుంది.
బాలీవుడ్‌ మార్కెట్‌ వంద కోట్లు దాటి రెండు వందల రేంజ్‌కి వెళ్లిందని ఆమధ్య సందడి చేసారు కానీ ఇప్పుడిప్పుడే వాపుని చూసి బలుపు అనుకున్నామని, ఇద్దరు హీరోల సక్సెస్‌ని చూసి మొత్తం మార్కెట్‌ని ఎక్కువ చేసి చూసామని తెలుసుకుంటున్నారు.