సరిగ్గా అసెంబ్లీ సమావేశాలకు కొద్ది రోజుల ముందు టీడీపీ సీనియర్ నేత, శాసనసభలో ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కింజరాపు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడంలో రాజకీయం లేదని ఎలా అనుకోగలం.? ఈ చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా జోరుగా సాగుతోంది. ఇదొక్కటే కాదు, ‘వియ్ స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్‌లో వుంది. టీడీపీలో సీనియర్ లీడర్ అయినా, సోషల్ మీడియాలో మాత్రం పెద్దగా ఫాలోయింగ్ లేదు అచ్చెన్నాయుడికి. అలాంటిది, ఒక్క అరెస్ట్‌తో సీన్ మారిపోయింది. సోషల్ మీడియా పోటెత్తుతోంది.
‘వైఎస్ జగన్ ప్రభుత్వం బీసీలను వేధింపులకు గురిచేస్తోంది’ అంటూ ట్వీట్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఇదంతా టీడీపీ మద్దతుదారుల ఉత్సాహమే కావొచ్చుగాక. కానీ, అనూహ్యంగా కింజరాపు అచ్చెన్నాయుడు.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయాడు. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన తీరుపై విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క, ఆయన అరెస్టుని సమర్థించేవారూ కన్పిస్తున్నారు. మంచో.. చెడో.. పబ్లిసిటీ అయితే వచ్చిపడింది.
బహుశా ఈ స్థాయిలో తన పేరు మార్మోగిపోతుందని అచ్చెన్నాయుడు కూడా ఊహించి వుండరేమో. ఈఎస్ఐ మెడికల్ స్కామ్ – అచ్చెన్నాయడు అరెస్ట్ వ్యవహారంపై రాజకీయ నాయకుల స్పందనలు హోరెత్తుతున్నాయి. ‘తప్పు చేస్తే శిక్ష విధించాల్సిందే.. కానీ, ఈ అరెస్ట్ మాత్రం సబబు కాదు’ అన్న అభిప్రాయాలే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ‘నోటీసుల్లేకుండా అరెస్ట్ చేయడమేంటి.?’ అనే ప్రశ్న ఓ వైపు వస్తోంటే, ‘నోటీసులు ఇచ్చే అరెస్ట్ చేశాం..’ అని హోంమంత్రి చెబుతుండడం ఆశ్చర్యకరం.
జనసేన పార్టీ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ‘అన్ని అక్రమాలపై దర్యాప్తు చేయాలి’ అంటూ జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పేరుతో ఓ ప్రెస్ నోట్ బయటకు వచ్చింది. ‘అచ్చెన్నాయుడి అరెస్ట్.. అవినీతికి పాల్పడినందుకా.? రాజకీయ కక్ష సాధింపు కోసమా.?’ అని జనసేన పార్టీ ప్రశ్నించింది. మొదటి నుంచీ జనసేన పార్టీకి వైసీపీ – టీడీపీల మధ్య సాగుతున్న ‘60 – 40’ బంధంపై చాలా అనుమానాలున్నాయి. ఇదే విషయాన్ని జనసైనికులు తాజాగా అచ్చెన్నాయుడు ఎపిసోడ్‌లోనూ ప్రస్తావిస్తున్నారు.
వేల కోట్లు, లక్షల కోట్లు అవినీతి జరిగిందంటూ అమరావతి, పోలవరం ప్రాజెక్టు వంటి విషయాల్లో యాగీ చేసిన వైసీపీ, 150 కోట్ల కుంభకోణం అని చెబుతున్న ఈఎస్ఐ మెడికల్ స్కావ్‌ు విషయంలోనూ, మజ్జిగ ప్యాకెట్ల విషయంలోనూ దూకుడు ప్రదర్శిచి.. మిగతా అంశాల్ని అటకెక్కించడమేంటన్నది జనసేన ప్రశ్న. ఏదిఏమైనా, అచ్చెన్నాయుడిని హీరోని చేసేందుకు పథకం ప్రకారం వైసీపీ ఆడుతోన్న గేవ్‌ు ప్లాన్ అనే విమర్శలకు అధికార పార్టీ నేతలే సమాధానం చెప్పాల్సి వుంటుంది.