ఆ సమాచారమిస్తే పదివేలిస్తాం: అచ్చెన్నాయుడు

ఏపీలో తన ప్రాభవం తిరిగి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ.. తిరుపతి ఉప ఎన్నికల్లో జోరు పెంచింది. తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని దింపిన టీడీపీ.. అందరి కంటే ముందుగానే నామినేషన్ వేసి ప్రచారం ప్రారంభించింది. ఎలాగైనా సరే ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా అధికార వైసీపీకి షాక్ ఇవ్వాలని పట్టుదలతో పనిచేస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార పార్టీ వాలంటీర్లకు పోటీగా తన కార్యకర్తలను రంగంలోకి దించింది. అలాగే వైసీపీకి ఓట్లేయకుంటే పథకాలు రావని ఎవరైనా బెదిరిస్తే.. అలాంటివారి సమాచారం తమకు ఇవ్వాలని, అలా ఇచ్చినవారి ఖాతాలో రూ.10వేలు వేస్తామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. తిరుపతిలోని ఏడు నియోజకవర్గాలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. వైసీసీకి ఓటేయకుంటే పథకాలు రావంటూ బెదిరించేవారి గుట్టు రట్టుచేయాలన్నారు.

7557557744 వాట్సాప్ నంబర్ కు ఆ కాల్ రికార్డు కానీ, ఫొటో కానీ వాట్సాప్ చేస్తే.. సంబంధిత వ్యక్తుల అకౌంట్ లో రూ.10వేలు జమ చేస్తామని స్పష్టంచేశారు. పథకాలు పోతాయనే భయం అవసరం లేదని, అవి ప్రజల డబ్బులని పేర్కొన్నారు. 10 పైసలు ఇచ్చి.. 90 పైసలు దోచుకుంటున్న జగన్ కు బుద్ది చెప్పాలంటే తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు.