కింగ్ మేకర్ నరేష్.. కామెడీకి పరాకాష్ట….!

సీనియర్ నటుడు నరేష్ తనను తాను కింగ్ మేకర్.. అని చెప్పుకుంటున్నారు. ‘నేనే రథ సారధిని.. నేనే మంచు విష్ణుని గెలిపించాను.. కొందరి అహంకారాన్ని దెబ్బకొట్టాం.. గెలిచి చూపించాం..’ అంటూ నరేష్ తన గురించి తాను కనీ వినీ ఎరుగని స్థాయిలో ప్రొజెక్ట్ చేసేసుకుంటున్నారట. ఈ వ్యవహారంపై ఇప్పుడు సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

నో డౌట్.. నరేష్ మంచి నటుడు. ఒకప్పుడు హీరోగా మంచి మంచి సినిమాలే చేశాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. సీనియర్ నటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మల తనయుడు నరేష్. సినీ రంగంలో రాజకీయాల్ని ఔపోసన పట్టేశాడు. నిన్న మొన్నటిదాకా ‘మా’ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ అనుభవంతో ‘మా’ అసోసియేషన్‌కి సంబంధించి కొన్ని ఓట్లను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు.

ఎంత ఖర్చు చేశారు.? తెరవెనుక ఏం రాజకీయాలు చక్కబెట్టారన్నది పక్కన పెడితే, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించిన నరేష్, తాను కోరుకున్నట్టుగానే మంచు విష్ణుని ‘మా’ అధ్యక్షుడిగా నిలబెట్టగలిగాడు. అయితే, ఇదేమన్నా అమెరికా అధ్యక్ష పదవా.? ‘ప్రపంచాన్ని మార్చేందుకు ముందడుగు వేశావ్..’ అని మంచు లక్ష్మి ట్వీటేసిందంటే.. అసలు విష్ణు ఆ పదవిని దక్కించుకోవడాన్ని ఎంత అద్భుతంగా కొందరు భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

వాట్ నెక్స్‌ట్.? ప్రభుత్వానికి వున్నట్టు అసోసియేషన్‌కి నిధుల విషయమై వెసులుబాట్లు వుండవు. అసోసియేషన్‌కి వచ్చే నిధులు ఎంత.? జరిగే ఖర్చులెంత.? ఇదంతా ఓ పెద్ద తతంగం. తన సొంత డబ్బులతో ‘మా’ కోసం భవనం నిర్మించి ఇచ్చేస్తానని మంచు విష్ణు చెప్పేశాడు. అదే ఇప్పుడు పెద్ద టాస్క్ అయి కూర్చుంటుంది. మరి, నరేష్ ఏమన్నా దానికోసం ‘సాయం’ చేస్తాడా.? అబ్బే, సాయం.. అంటే ఆమడ దూరం పారిపోతాడంతే.

చాలా కష్టపడి సినీ పరిశ్రమలో ‘మా’ ఎన్నికల ద్వారా ‘విభజన రేఖ’ గీయగలిగానని నరేష్ అనుకుంటున్నాడు. కానీ, ఇది తాత్కాలికం. సినీ పరిశ్రమలో అవసరాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయ్. ఇప్పుడంతా నరేష్‌ని ‘శకుని’గానే చూస్తున్నారు. సమయమొచ్చినప్పుడు ఆ శకుని ఎలా సైడయిపోతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సమయం కూడా ఎంతో దూరంలో లేదు.. పరిస్థితులే అతన్ని దూరంగా గెంటేస్తాయ్.. అప్పుడు కింగ్ మేకర్ కాదు.. కామెడీకి పరాకాష్ట అనిపించుకోవాల్సి వస్తుంది.