సినిమా ఫీల్డ్ వదిలేసినందుకు చాలా ఫీలవుతోందట!

తెలుగులో హీరోయిన్ గా అక్క పాప్యులర్ అయితే ఆ తరువాత చెల్లెలు రంగంలోకి దిగిన సందర్భాలు చాలానే కనిపిస్తాయి. జయసుధ తరువాత ఆమె చెల్లెలు .. భానుప్రియ తరువాత ఆమె చెల్లెలు .. ఇలా కొంతమంది రంగంలోకి దిగారు. అయితే ముందుగా ఫీల్డ్ కి వచ్చిన అక్క స్థాయిలో ఎవరి చెల్లెలు కూడా పాప్యులర్ కాలేకపోయారు. అలాంటివారి జాబితాలో ‘శుభశ్రీ’ కనిపిస్తుంది. మాలాశ్రీ చెల్లెలు అయిన శుభశ్రీ ‘జెంటిల్మెన్’ .. ‘ పెదరాయుడు’ వంటి సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఐదేళ్లలో 30 సినిమాల వరకూ చేసిన ఆమె పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉంటూ వచ్చింది.

తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మాట్లాడుతూ .. “నాకు చదువుకోవడమంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. స్కూల్ లో ఎక్కువగా అల్లరి .. ఆకతాయి పనులు చేసే దానిని. దాంతో పేరెంట్స్ ను తీసుకుని రమ్మని చెప్పేవారు. అలా మా స్కూల్ కి రాలేక మా అన్నయ్యకి విసుగు వచ్చేసేది. మొదటి నుంచి కూడా నాకు మ్యాథ్స్ అంటే భయం. అందువలన నేను క్లాస్ లో కాకుండా గ్రౌండ్ లో ఉండేదానిని. చదవక పోవడం వలన మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యాను. అల్లరి పనుల వలన నాకు టీసీ ఇచ్చి పంపించేశారు.

“పెళ్లికి ముందు కెరియర్ ముఖ్యమా? పెళ్లి ముఖ్యమా? అని మా వారు అడిగితే పెళ్లే ముఖ్యమని చేసుకున్నాను. ఇప్పటికి మా పెళ్లి జరిగి 24 ఏళ్లు అవుతోంది. మాకు ఒక బాబు ఉన్నాడు. బెంగుళూర్ లోనే డిగ్రీ చదువుతున్నాడు. తనకి సినిమాల్లో నటించడమంటే చాలా ఇష్టం. నేను రీ ఎంట్రీ ఇస్తే తను సినిమాల్లోకి రావడం ఈజీ అవుతుందని చూస్తున్నాడు. మా అక్కయ్య మాలాశ్రీ చిన్నప్పటి నుంచి ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది. కానీ నేను మాత్రం ఇండస్ట్రీలో ఐదేళ్లు మాత్రమే ఉన్నాను.

అరే చాలా తక్కువ కాలం సినిమాల్లో ఉన్నానే .. చాలా త్వరగా ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చేశానే .. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజున సినిమాలా? పెళ్లా? అనే టాపిక్ మా వారు తీసుకుని రాకుండా ఉంటే బాగుండేదని ఆయనతో అంటూ ఉంటాను.

అలా అని చెప్పేసి నా వైవాహిక జీవితంలో ఎలాంటి అసంతృప్తి లేదు. జీవితం చాలా హ్యాపీగా సాగిపోతోంది. తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలని ఉంది. నాకు తగిన పాత్రలు వస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మళ్లీ నేను సినిమాల్లోకి వెళ్లాలని మా అబ్బాయి పట్టుపడుతున్నాడు. మా అక్కయ్యతో పాటు నాతో అప్పట్లో సినిమాలు చేసిన వాళ్లంతా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు” అని చెప్పుకొచ్చింది.