‘ఆదిపురుష్‌’లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్టార్‌ కూడా..!

ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదిపురుష్‌ సినిమాకు సంబంధించిన మరో కీలక ప్రకటన వచ్చేందుకు రెడీగా ఉంది. అదే బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్ దేవగన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్న ఈ స్టార్‌ నటుడు వచ్చే ఏడాది షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఆది పురుష్‌ లో నటించేందుకు సిద్దం అవుతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ సినిమాలో ఎక్కువ శాతం గ్రాఫిక్స్‌ వర్క్‌ ఉంటుంది. కనుక హీరోలు నెలలకు నెలలు ఈ సినిమాకు డేట్లు ఇవ్వనక్కర్లేదు. అందుకే అజయ్‌ దేవగన్‌ కేవలం మూడు లేదా నాలుగు వారాలు షూటింగ్‌ లో పాల్గొటే సరిపోతుందట. బాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అజయ్‌ దేవగన్‌ శివుడి పాత్రలో కనిపించబోతున్నాడట. రామాయణం అంటూ ఈ సినిమా గురించి ఇప్పటికే టాక్‌ ఉంది. అయితే కాస్త విభిన్నమైన రామాయణం అంటున్నారు. రాముడిగా ప్రభాస్‌, లంకేశ్వరుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తుండగా శివుడి పాత్రలో అజయ్‌ దేవగన్‌ ఓకే అయ్యాడట.

ఈ నెలలో ప్రభాస్‌ పుట్టిన రోజు ఉంది. ఆ రోజున ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్‌ బర్త్‌ డే రోజున ఇచ్చే అప్‌డేట్‌ అజయ్‌ దేవగన్‌దే అయ్యి ఉంటుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలో ఆ సినిమా షూటింగ్‌ కోసం వెళ్లబోతుంది. జనవరిలో షూటింగ్‌ను ప్రారంభించి 2022లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఓం రౌత్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.