ఆ సినిమా కోసం పోలీసులకు సెలవిచ్చారు

ఒక సినిమా కోసం కంపెనీలు సెలవు ప్రకటించటం ఈ మధ్యన చూస్తున్నదే. బడా స్టార్ సినిమాలకు కొన్ని కంపెనీలు స్పందిస్తున్నాయి. అయితే.. ఒక చిన్న సినిమా.. అట్టే థియేటర్లు కూడా లభించని చిత్రం కోసం ఒక జిల్లాలోని హెడ్ కానిస్టేబుళ్ల అందరికి సెలవు ఇచ్చిన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. సంక్రాంతి బరిలో నిలిచిన చిన్న సినిమా హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమాను చూసేందుకు అదిలాబాద్ జిల్లా ఎస్పీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నారాయణమూర్తి సినిమా నైజాంలో పరిమిత థియేటర్లలో విడుదలైంది కానీ.. ఏపీలో ఒక్కథియేటర్లో కూడా విడుదల కాలేదు. ఈ విషయం మీద ఇప్పటికే చిత్ర కథానాయకుడు నారాయణమూర్తి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను జిల్లా వ్యాప్తంగా ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి చూసేందుకు వీలుగా అదిలాబాద్ ఎస్పీ శ్రీనివాస్ ‘గరువారం’ సెలవు ప్రకటించారు.

దీంతో.. జిల్లాలోని 230 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఈ రోజు సినిమాను చూసే వీలు లభించనుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న హెడ్ కానిస్టేబుళ్ల కోసం అదిలాబాద్ లో ప్రత్యేక షోను ప్రదర్శిస్తున్నారు. ఒక చిన్న సినిమాను చూసేందుకు వీలుగా పోలీసుశాఖ తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వటం ఆసక్తికరమే.