‘బాహుబలి’ నుంచి బయటికి రావడం కష్టమే

ఒక హిట్ సినిమా తీయగానే.. దాని నిర్మాత వెంటనే ఇంకో సినిమాను లైన్లో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అందులోనూ ఇండస్ట్రీ హిట్ తీసిన నిర్మాతలకైతే ఉత్సాహం మరింత ఉంటుంది. ఐతే ‘బాహుబలి’ లాంటి మెగా బ్లాక్ బస్టర్‌ను నిర్మించిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని మాత్రం.. దీని తర్వాత ఏం సినిమా చేయాలనే దానిపై క్లారిటీ ఉన్నట్లుగా లేరు.

‘బాహుబలి’ కోసమే ఐదేళ్లకు పైగా వెచ్చించిన నిర్మాతలు.. ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటికి వచ్చేలా లేరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శోభు మాట్లాడుతూ.. తమ ప్రొడక్షన్లో తర్వాతి సినిమా ఏదీ ప్లాన్ చేయలేదని చెప్పాడు. ‘బాహుబలి’కి సంబంధించి తమకు ఇంకా చాలా పనే ఉందని చెప్పాడు.

‘బాహుబలి’ రిలీజైపోయింది కదా అని నిర్మాతలు రిలాక్స్ అయిపోయే పరిస్థితి లేదు. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని దేశాల్లో రిలీజ్ చేయాల్సి ఉంది. ఇంటర్నేషనల్ వెర్షన్‌ను ప్రత్యేకంగా ఎడిట్ చేయించాలి. చైనా లాంటి దేశాల్లో ‘బాహుబలి-2’ను ఓ ప్రణాళిక ప్రకారం రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు బాహుబలి టీవీ సిరీస్ అని.. వెబ్ సిరీస్ అని.. వర్చువల్ రియాలిటీ అని.. కామిక్స్ అని.. బుక్స్ అని.. వీడియో గేమ్స్ అని.. ఇలా చాలా వ్యవహారాలే ముడిపడి ఉన్నాయి.

ఈ బాహుబలి మర్చండైజ్ అన్నింటినీ మార్కెట్ చేసుకుని.. వీటిని విజయవంతం చేయడానికి బాహుబలి నిర్మాతలు మరి కొన్నేళ్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇందులో ఆదాయం కూడా భారీగా ఉండటంతో వేరే సినిమాల కోసం తాపత్రయ పడాల్సిన అవసరం లేదు. మొత్తంగా ఇదంతా చూస్తుంటే ఈ జన్మకు బాహుబలి చాలు అని శోభు, ప్రసాద్ ఫిక్సయిపోయినట్లుగా ఉంది పరిస్థితి.