‘వలిమై’ ప్రోమోకి వచ్చినవన్నీ పెయిడ్ లైకులేనా..?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ – టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ”వలిమై” రిలీజ్ కు రెడీ అయింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ఫిబ్రవరి 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తమిళంతో పాటుగా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.

ఇప్పటికే ‘వలిమై’ సినిమా నుంచి వచ్చిన స్పెషల్ పోస్టర్స్ – టీజర్ – ట్రైలర్ మరియు పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. మిలియన్ల కొలదీ వ్యూస్ తో అత్యధిక లైక్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసాయి. ఈ క్రమంలో ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట దుమారం రేపుతోంది. ఈ వీడియో లైక్స్ జెన్యూన్ గా వచ్చినవి కాదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

యూట్యూబ్ లో మిలియన్ లైక్ ల మార్క్ ను దాటించడానికి మేకర్స్ కేవలం ఒక గంటలో 30 వేల వరకు లైక్ లను బూస్టప్ చేసారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంటీ ఫ్యాన్స్ #ValimaiPaidLikesExposed అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ప్రారంభించారు. యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ మరియు లైక్ లను పొందడానికి ‘వాలిమై’ మేకర్స్ పెయిడ్ వ్యూహాన్ని ఉపయోగిస్తోందని ట్వీట్లు పెడుతున్నారు.

అయితే అజిత్ ఫ్యాన్స్ వీటిని తిప్పికొడుతున్నారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ద్వారా తమ హీరో ప్రతిష్టను దెబ్బతీసేందుకు యాంటీ ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నారని.. వాళ్ళ హీరోల రికార్డులు బ్రేక్ అవుతున్నాయనే ఆవేదనతో అలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు.

వాస్తవానికి స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ బయటకు వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ మధ్య పెయిడ్ లైక్స్ మీద వార్ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ – కోలీవుడ్ లలో ఇది కనిపిస్తుంది. తమ హీరో రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి ఇలాంటి వ్యూహంతో వస్తుంటారని ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. అభిమానులు మరియు మేకర్స్ ఈ యూట్యూబ్ రికార్డ్స్ క్రేజ్ నుండి ఎప్పుడు బయటపడతారో మరి.