తేడా వస్తే తాట తీస్తా.. అక్బరుద్దీన్ హెచ్చరిక

మజ్లిస్ కార్పొరేటర్లు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ స్పష్టంచేశారు. పార్టీ కార్పొరేటర్లు తమ పదవులను అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం లేదా వేధింపులకు పాల్పడటం వంటివి చేస్తే ఊరుకునేది లేదన్నారు. అలాంటివారి కాలర్ పట్టుకుని నడిబజారులో నిలబెడతానని హెచ్చరించారు. ఆదివారం హఫీజ్ బాబానగర్ లోని ఓ ఫంక్షన్ హాలులో పార్టీ కార్పొరేటర్లతో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో గెలుపొందిన కార్పొరేటర్లను సన్మానించారు.

అనంతరం అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు తమ పదవులను ప్రజాసేవ కోసం దేవుడిచ్చిన అవకాశంగా భావించాలని సూచించారు. ఎవరైనా పదవులను అడ్డంపెట్టుకుని వసూళ్లకు పాల్పడితే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టంచేశారు. చేతిలో అధికారం ఉంది కదా అని ఎవరినీ వేధించొద్దని హెచ్చరించారు. చాంద్రాయణగుట్ట ప్రాంతం తాను రక్తం చిందించిన నేల అని.. ఈ ప్రాంతం అంటే తనకు ఎంతో మక్కువ అని పేర్కొన్నారు. అక్కడి ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే కార్పొరేటర్లు, పార్టీ నాయకులు తీవ్ర పరిణామాలు చవిచూస్తారని ఆయన హెచ్చరించారు.

Share