నందమూరి బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ డ్రామా ”అఖండ”. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. ఐదో వారంలోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
విడుదలై 30 రోజులు దాటినా థియేటర్ల వద్ద ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు పెడుతున్నారంటే.. అఖండ మాస్ జాతర ఏ రేంజ్ లో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఊపు చూస్తుంటే మరికొన్ని వారాలు బాలయ్య సినిమా మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం కనిపిస్తోంది.
సంక్రాంతి రేసులో’ ‘రాధేశ్యామ్’ ‘బంగార్రాజు’ మినహా పెద్ద సినిమాలేవీ లేకపోవడం ‘అఖండ’ కు కలిసొచ్చే అంశమని.. బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ తో దూసుకుపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే సంక్రాంతి పండక్కి ఈ సినిమాని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ‘అఖండ’ చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. డిస్నీ+ హాట్ స్టార్ తో 6 వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ చేసుకునే విధంగా మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ సినిమా బాక్సాఫీస్ పుల్స్ చూసిన తర్వాత ఇంకొన్నాళ్ళు థియేటర్స్ లోనే ఉంచాలని నిర్మాతలు భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలో బాలయ్య 106వ సినిమా ఓటీటీ విడుదలను రెండు వారాల పాటు వాయిదా వేయమని డిస్నీ హాట్ స్టార్ ను మేకర్స్ అభ్యర్థించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ‘అఖండ’ నిర్మాతల రిక్వెస్ట్ ని హాట్ స్టార్ తిరస్కరించిందట.
ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి ఈ సంక్రాంతి సీజన్ లో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంచాలని ఓటీటీ దిగ్గజం భావిస్తోందట. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘అఖండ. క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని.. దీంతో మిగతా ఓటీటీలకు గట్టి పోటీ ఇవ్వాలని డిస్నీ+ హాట్ స్టార్ యోచిస్తోందని టాక్ నడుస్తోంది.
ఇదే కనుక నిజమైతే ‘అఖండ’ సినిమా పెద్ద పండక్కి ఓటీటీ వేదిక మీదకు వచ్చేఅవకాశం ఉంది. కరోనా కారణంగా పెద్ద సినిమాలేవీ థియేట్రికల్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల బాలయ్య సినిమాకు మంచి వ్యూయర్ షిప్ దక్కే ఛాన్స్ ఉంది. మరి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
కాగా ‘అఖండ’ చిత్రంలో అఘోరాగా మురళీకృష్ణగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా.. శ్రీకాంత్ – జగపతి బాబు – పూర్ణ – నితిన్ మెహతా – కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.
సి. రామ్ ప్రసాద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. కోటగిరి వెంకటేశ్వరరావు – తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.