అఖిల్ కోసం మనం టీం తిరిగొచ్చింది

ఎట్టకేలకు అక్కినేని అఖిల్ రెండో సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. ‘అఖిల్’ రిలీజైన దాదాపు ఏడాదిన్నర తర్వాత ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం విశేషం. ఏప్రిల్ 1నే ఈ చిత్ర ప్రారంభోత్సవం జరపాలని అనుకున్నా.. ఆ రోజు ఫూల్స్ డే కావడంతో మరుసటి రోజుకు ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ కార్యాలయంలో పెద్దగా హడావుడి లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉదయం నుంచి ఈ కార్యక్రమం గురించి మీడియాకు ఎలాంటి సమాచారం లేదు. చడీచప్పుడు లేకుండా ప్రైవేటుగా కార్యక్రమం కానిచ్చేసి.. రాత్రి ఫొటోలు రిలీజ్ చేశారు. అఖిల్‌తో పాటు నాగార్జున, అమల, నాగచైతన్య, రాఘవేంద్రరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇష్క్, మనం, 24 లాంటి మైల్ స్టోన్ మూవీస్ తీసిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబానికి ‘మనం’ లాంటి మరపురాని చిత్రాన్ని అందించిన విక్రమ్ చేతికే తన కొడుకును అప్పగించాడు నాగార్జున. సెంటిమెంటుగా ‘మనం’ టీంలోని కీలకమైన టెక్నీషియన్లందరినీ ఈ చిత్రానికి తీసుకోవడం విశేషం.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇవ్వబోతుంటే.. పి.ఎస్.వినోద్ ఛాయాగ్రహణం అందించనున్నాడు. రాజీవన్ ఆర్ట్ డైరెక్షన్ చేస్తుంటే.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. విక్రమ్ మరోసారి తనదైన శైలిలో విభిన్నమైన స్క్రిప్టుతో వస్తున్నట్లు చెబుతున్నారు. ఇదొక డిఫరెట్ కమర్షియల్ ఫిల్మ్ అని విక్రమ్ చెబుతున్నాడు. మరి ‘మనం’ టీం ‘అఖిల్’ గాయాన్ని మాన్పే సినిమాను అందిస్తుందేమో చూద్దాం.