జయంతి స్పెషల్‌ : ఏయన్నార్‌ 75 ఏళ్ల అద్బుత సినీ ప్రయాణం

ఒక సాదారణ చిన్న పల్లెటూరులో వ్యవసాయ ఆధారిత కుటుంబంలో జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు చిన్న తనం నుండే నాటకాలపై ఎంతో ఆసక్తి. వ్యవసాయం చేస్తూనే నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఎన్నో నాటకాలు వేసిన నాగేశ్వరరావుకు బాల నటుడిగానే చిన్న తనంలో ఆఫర్లు వచ్చాయి. నాటకాల్లో ఎక్కువగా అమ్మాయి వేశాలు వేసేవారట. ఆయన ఆహార్యం మరియు స్కిన్‌ టోన్‌ అమ్మాయి వేశంకు బాగా సరిపోయేవిగా ఉండటం వల్ల ఎన్నో సార్లు అమ్మాయి వేశం వేయడం జరిగిందని ఏయన్నార్‌ గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబర్ 20 న వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు ఏయన్నార్‌ జన్మించారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు చెందిన అన్నపూర్ణను 1949 ఫిబ్రవరి 18న అక్కినేని వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందే సినిమాల్లో ఏయన్నార్‌ నటించడం మొదలు పెట్టారు. మొదటగా 1941లో సి పుల్లయ్య తీసిన ధర్మపత్ని అనే సినిమాలో బాల నటుడిగా కనిపించాడు.

1944 లో పూర్తి స్థాయి హీరోగా సీతారామ జననం సినిమాలో నటించాడు. ఘంటసాల బలరామయ్య దర్శకత్వంలో ఏయన్నార్‌ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత నుండి వెను దిరిగి చూసుకోలేదు. ఏకంగా 75 ఏళ్ల సినీ ప్రస్థానంను ఏయన్నార్‌ కొనసాగించారు. చనిపోయే వరకు కూడా ఆయన సినిమాలు చేస్తూనే వచ్చారు. చనిపోయే ముందు కూడా ‘మనం’ సినిమాను చేసి దానికి డబ్బింగ్‌ చెప్పి చనిపోయారు.

ఏయన్నార్‌ సినీ కెరీర్‌ లో ఎన్నో అవార్డులు, రివార్డులు, బిరుదులు పొందారు. ఆయన తెలుగు సినిమాకు తొలి తరం అగ్రకథానాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్‌కు సముజ్జీ అయిన ఏయన్నార్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుతో పాటు దాదా సాహెబ్‌ పాల్కె అవార్డును ఇచ్చింది. పలు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు, నంది అవార్డులు కూడా ఏయన్నార్‌ అందుకున్నారు.
నటుడిగానే కాకుండా భార్య అన్నపూర్ణ పేరుతో స్టూడియోను ఏర్పాటు చేసి సినిమాలను నిర్మించారు.

ప్రస్తుతం కూడా హైదరాబాద్‌ లో అతి పెద్ద స్టూడియోల్లో అన్న పూర్ణ స్టూడియో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్యాన్సర్‌ తో బాధపడుతున్న ఎయన్నారు 2014 జనవరి 22వ తారీకున 90 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. 75 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో అద్బుతమైన సినిమాలను అందించడమే కాకుండా వేలాది మందికి ఆదర్శంగా నిలిచిన ఏయన్నార్‌ గారికి మరో సారి నివాళ్లు అర్పిస్తున్నాం.