సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది.. సహనం నశిస్తే తిరుగుబాటు తప్పదు. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత సెలబ్రిటీలపై రాతలు ఎక్కువయ్యాయి. ఇందులో నిజాల కంటే గాసిప్స్, అసత్యాలే ఎక్కువ. దాదాపు చూసీచూడనట్టు వ్యవహరించే సెలబ్రిటీలు ఒక్కోసారి వారిపై తిరగబడతారు.. ఏకంగా పోలిస్ కంప్లైంట్ల వరకూ వెళ్తారు. ఇలాంటి రాతల్ని తట్టుకోలేక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఏకంగా ఓ యూట్యూబర్ పై 500 కోట్ల పరువు నష్టం దావా వేశాడు.
అక్షయ్ ఈ దావా వేయడానికి.. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పరోక్షంగా అక్షయ్ కుమార్ కారణమంటూ రషీద్ సిద్దిఖి అనే బిహార్ వ్యక్తి ఓ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడమే. రియా చక్రవర్తికి కెనడా పారిపోయేందుకు సహకరించాడనీ.. కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు పోలీసులతో టచ్ లో ఉన్నాడనీ.. సుశాంత్ చేసిన ధోనీ సినిమాను తనకు దక్కించుకునే ప్రయత్నాలు చేసాడని.. మరిన్ని అవకాశాలు రాకుండా అడ్డుపడ్డాడని.. ఇలా పలు వ్యాఖ్యలతో ఆ వీడియోలో పేర్కొన్నాడు.
తన యూట్యూబ్ చానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియోతో ఏకంగా 15లక్షలు సంపాదించాడని తెలుస్తోంది. అక్షయ్ పేరు ఉండటంతో వ్యూస్ కూడా అలాగే వచ్చాయని తెలుస్తోంది. ఇంకా పలు ఆరోపణలతో వీడియోలు ఉండటంతో అక్షయ్ విసిగిపోయాడట. దీంతో ఇంత భారీ మొత్తంతో రషీద్ పై పరువు నష్టం దావా వేశాడు. మరి దీనిపై రషీద్ ఎలా స్పందిస్తాడో చూడాలి.