కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. వీరి భేటీలో ఏపీ రాజకీయాలు.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ జరిగింది. ప్రస్తుతం వైసీపీ వర్సెస్ రఘురామకృష్ణ రాజుగా పరిస్థితులు మారిపోయాయి. ఈనేపథ్యంలో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉంది. మరోవైపు.. రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.
దీంతో స్పీకర్ రఘురామకు వివరణ ఇవ్వాలంటూ లేఖ రాశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ లోక్ సభలో వైసీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో ప్రత్యేక హోదాపై సీఎం ఆదేశిస్తే ఎంపీలు అంతా రాజీనామా చేస్తామని రఘురామ ప్రకటించారు. ఇన్ని పరిణామాల నేపథ్యంలో రఘురామ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. రఘురామ ఆరోగ్య పరిస్థితులపై అమిత్ షా అడిగి తెలుసుకున్నారు.