కందకి లేని దురద కత్తి పీటకెందుకట.? జనసేన అదినేత పవన్ కళ్యాణ్, బీజేపీ సీనియర్ నేత.. కేంద్ర మంత్రి అమిత్ షాని కలవలేదట. పవన్ కళ్యాణ్‌కి అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరకలేదట. రెండు చోట్లా పవన్ కళ్యాణ్ ఓడిపోయినందువల్ల భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దృష్టిలో పవన్ కళ్యాణ్ పలచనైపోయారట. జనసేన పార్టీని వదిలించుకోవాలని భారతీయ జనతా పార్టీ చూస్తోందట. ఇదండీ ‘బులుగు’ పైత్యం.
పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది. అలాంటప్పుడు, పవన్ కళ్యాణ్ ఓటమి అనే అంశం ఇక్కడ ఎందుకు ప్రస్తావనకు వస్తుంది.? పవన్ కళ్యాణ్ సంగతి కాస్సేపు పక్కన పెడదాం. కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేకపోయారట.? కేంద్ర మంత్రి అపాయింట్‌మెంట్, ముఖ్యమంత్రికి దొరకలేదని అనాలా.?
ప్రస్తుతానికైతే బీజేపీ – జనసేన మధ్య అధికారికంగా పొత్తు కొనసాగుతోంది. ఈ పొత్తు బలంగా వుందా.? బలహీనంగా వుందా.? అన్నది వేరే చర్చ. ఈ పొత్తు వల్ల రెండు పార్టీల్లో ఎవరికెంత లాభం.? అన్నది మరో చర్చ. ఇప్పుడైతే ఎన్నికల్లేవు. ఎన్నికల నాటికి ఈ పొత్తుల వ్యవహారాలు.. వాటి పరిణామాల గురించి చర్చించుకోవచ్చు. కేంద్ర మంత్రి అమిత్ షా, సుడిగాలి పర్యటన చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. హైద్రాబాద్ చేరుకుని, అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళి.. దేవుడి దర్శనం చేసుకుని, తిరిగి హైద్రాబాద్ వచ్చి.. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఇది మెరుపు పర్యటన మాత్రమే.
బీజేపీకి చెందిన చాలా మంది ప్రముఖులే, అమిత్ షా పర్యటనలో కన్పించలేదు. అలాంటప్పుడు, పవన్ కళ్యాణ్ మాత్రం ఈ పర్యటనలో అమిత్ షా వెంట వుండాలనో, అమిత్ షాని కలవాలనో.. ఎలా అనగలం.? అయినా, పవన్‌ని అమిత్ షా పట్టించుకోలేదని ఎందుకు అనుకోవాలట… పవన్ కళ్యాణే, అమిత్ షాని పట్టించుకోలేదని అనుకోవచ్చు కదా.? పైత్యం ముదిరి పాకాన పడితే, వచ్చే అనుమానాలు ఇలాగే వుంటాయ్. ‘పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన – బీజేపీ అధికారంలోకి వస్తాయి..’ అని స్వయంగా బీజేపీ నాయకత్వమే చెబుతోంది. అలాంటప్పుడు, పవన్ కళ్యాణ్‌ని బీజేపీ పక్కన పెట్టిందని ఎవరైనా అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.