తమిళనాడులో బీజేపీ బలం, బలగం పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఉత్తరాదిన ఉన్న హవా దక్షిణాదిలో కర్ణాటకలో తప్పితే మిగిలిన రాష్ట్రాల్లో లేదు. కానీ.. తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నికల్లో విజయం సాధించి తమ బలం పెంచుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఇప్పుడు మరో కీలక రాష్ట్రం తమిళనాడులో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. బీజేపీ. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా ఈనెల 21న తమిళనాడు పర్యటనకు రావడం కీలకంగా మారింది. అమిత్ షా పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. తన పర్యటనలో రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మురుగన్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వ్యూహం సిద్ధం చేయనున్నారు. అయితే.. అమిత్ షా పర్యటనలో మరో అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం కానుంది.
తమిళ అగ్ర కథానాయకుడు రజినీకాంత్ ను అమిత్ షా కలుస్తారనే వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. రజినీ తన పొలిటికల్ స్టాండ్ పై ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినా బీజేపీకి మిత్రుడిగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి భేటిలో రజినీ పార్టీ పెడతారనే విషయం వెల్లడవుతుందా.. బీజేపీకి మద్దతిస్తారా.. అనే విషయాలు వెల్లడి కానున్నాయి. దీంతో రజినీ అభిమానుల్లో.. రాజకీయ వర్గాల్లో వీరిద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది.